
తాజా వార్తలు
‘టీకా తయారీ సంస్థలను ప్రభుత్వమే రక్షించాలి’
సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో పూనావాలా కీలక వ్యాఖ్యలు
ముంబయి: టీకా తయారీదారులకు న్యాయపరమైన రక్షణ ప్రభుత్వాలే కల్పించాలని ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా అన్నారు. ముఖ్యంగా మహమ్మారి సమయంలో సంస్థలపై దాఖలయ్యే కేసుల విషయంలో సర్కార్ అండగా నిలవాలని కోరారు. వర్చువల్ విధానంలో శనివారం జరిగిన ‘కార్నెగీ ఇండియా గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లపై చర్చ సందర్భంగా పూనావాలా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆరోపణల కారణంగా ప్రజల్లో అనవసర భయాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వ్యాక్సినేషన్.. తద్వారా కరోనా కట్టడికి పెద్ద అవరోధంగా మారే ప్రమాదం ఉందన్నారు. అలాగే తయారీ సంస్థలు సైతం టీకా ఉత్పత్తి నుంచి తప్పుకునే పరిస్థితులు ఉత్పత్తన్నమవుతాయన్నారు. ఇదే జరిగితే ఆయా సంస్థలు దివాళా తీసే ప్రమాదం కూడా ఉందన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని టీకా తయారీ సంస్థలకు రక్షణనివ్వాలని పూనావాలా కోరారు. ఇలాంటి న్యాయపరమైన చిక్కుల నుంచి సంస్థల్ని కాపాడేందుకు ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా తయారీ సంస్థలు టీకా ఉత్పత్తి, పంపిణీ వంటి కీలక విషయాలపై మాత్రమే దృష్టి సారించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌కు భారత్‌లో సీరం ఇన్స్టిట్యూట్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ‘కొవిషీల్డ్’ పేరిట ఇస్తున్న ఈ టీకాతో తనలో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తాయంటూ చెన్నైకి చెందిన ఓ వాలంటీర్ సీరంకు లీగల్ నోటీసులు పంపారు. అయితే, అవన్నీ అవాస్తవమని.. ఆయనలో తలెత్తిన దుష్ప్రభావాలకు టీకాతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ఉదంతం నేపథ్యంలో పూనావాలా తాజా వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.
ఇవీ చదవండి...