close

తాజా వార్తలు

Updated : 07/09/2020 00:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పనికొచ్చిన వందరోజుల పని!

అవంతీపుర రాజ్యాన్ని అమరసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడి మంత్రిపేరు సుబుద్ధి. రాజ్యానికి సమీపంలో నది ఉండడంతో కరవు అన్నదే లేదు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించేవారు. రాజుగారికి పాలనలో మంత్రి చక్కగా సాయం చేసేవారు. రాజ్యానికి శత్రురాజుల బెడదకూడా లేదు. దీంతో రాజు ఏ చీకూచింతా లేకుండా ఉండేవాడు. పైగా అమరసేనుడు భోజన ప్రియుడు. రోజూ.. మూడు పూటలా పంచభక్ష్య పరమాన్నాలే తీసుకునేవాడు.
కొంతకాలానికి రాజు శరీరం భారీగా పెరిగింది. ఆఖరుకు కాలకృత్యాలు తీర్చుకోవడమూ కష్టమయ్యేది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి వచ్చింది. అనారోగ్య సమస్యలూ చుట్టుముట్టాయి. రాజవైద్యులతోపాటు ఇతర రాజ్యాల వైద్యులూ రాజును పరీక్షించి ఎన్నో రకాల మందులు వాడించారు. అయినా ఫలితం కనిపించలేదు. కొద్దిరోజులకు ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. ఇలాగే కొనసాగితే రాజుగారి ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారు.
ఓ రోజు మంత్రి ఒక యువకుని తీసుకువచ్చి ‘మహా రాజా! ఇతను గొప్ప వైద్యుడు. ఎటువంటి మొండి వ్యాధులనైనా నయం చేయగలడు. కానీ ఇతడు వైద్యం చేస్తున్నప్పుడు ఆహార నియమాలతో పాటు, ఇతను చెప్పిన విధంగా తమరు కచ్చితంగా వినాలి’ అన్నాడు.
‘మంత్రివర్యా! అతను నా ప్రాణాలు కాపాడగలిగితే అంతకన్నా కావాల్సింది ఏముంది? అలాగే అతని మాటప్రకారమే నడుచుకుంటాను’ అన్నాడు రాజుగారు. ‘మహారాజా నేను చెప్పిన విధంగా నామాటకు ఎదురు చెప్పకుండా తమరు నడుచుకుంటే వందరోజుల్లో తమరి ఆరోగ్యం సరిచేస్తాను’ అన్నాడు వైద్యుడు.
మరుసటిరోజు నుంచే వైద్యం ప్రారంభమైంది. ఆహారంలో పచ్చికూరగాయలు, పండ్లు ఇచ్చాడు వైద్యుడు. నెమ్మదిగా తోటలో నడిపిస్తూ.. క్రమేణా దూరం పెంచాడు. చెట్లకు పాదులు తీయించాడు. బావిలోని నీరు తోడి మొక్కలకు పోయించాడు. ఆహారమూ మితంగానే ఇచ్చేవాడు. వందరోజుల్లో రాజుగారి శరీరం పూర్వ ఆకృతికి రావడంతోపాటు ఆరోగ్యం కుదుటపడింది.
పరిపూర్ణ ఆరోగ్యం పొందిన రాజు సంతోషంతో ‘నాయనా.. అందరూ అసాధ్యం అన్నది నువ్వు సుసాధ్యం చేశావు. నా ఆరోగ్యం బాగు చేశావు. నీకు ఏం కావాలో కోరుకో’ అన్నాడు.
‘మహారాజా తమరిని పరీక్షించిన వైద్యులు అందరూ ఇంతటి కష్టతరమైన శ్రమతో కూడుకున్న వైద్యాన్ని మీకు చెప్పడానికి భయపడ్డారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే బతకడం కోసం తినాలి. తినడం కోసం బతకకూడదు. పరిమిత ఆహారంతోనే ఆరోగ్యం. ఇక మీదటా ఇదే కొనసాగించండి’ అని చెప్పాడు వైద్యుడు.
యువవైద్యుడి పద్ధతి, ముక్కుసూటితనం నచ్చి.. రాజు తన ఆస్థాన వైద్యుడిగా నియమించాడు. ఆరోగ్య నియమాలు తూచా తప్పకుండా పాటిస్తూ.. అమరసేనుడు చక్కగా రాజ్యాన్ని పాలించాడు.

- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని