
తాజా వార్తలు
‘ఖేల్‌రత్న’ దరఖాస్తుకు అర్హుడిని కాదు: భజ్జీ
అందులో పంజాబ్ ప్రభుత్వ తప్పేం లేదు
ఇంటర్నెట్‌డెస్క్: ఈ ఏడాది ఖేల్ రత్న పురస్కారానికి తాను అర్హుడిని కాదని టీమ్ఇండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఆ నామినేషన్ల ప్రక్రియలో తన పేరును తొలగించడంపై వివాదం తలెత్తడంతో భజ్జీ ట్విటర్ వేదికగా స్పందించాడు. ఈ విషయంలో పంజాబ్ ప్రభుత్వం తప్పేమీ లేదని, ఏ ఆటగాడైనా ఈ పురస్కారానికి దరఖాస్తు చేయాలంటే గత మూడేళ్ల అంతర్జాతీయ ప్రదర్శన కనీస ప్రామాణికమని తెలిపాడు. ఆ కారణంగానే పంజాబ్ ప్రభుత్వాన్ని తన పేరును తొలగించమని స్వయంగా కోరినట్లు స్పష్టం చేశాడు.
ఈ పురస్కారానికి గతేడాది తాను ఆలస్యంగా దరఖాస్తు చేశానని, ఈసారి తన పేరును తొలగించిన నేపథ్యంలో ఎవరూ ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నాడు. మీడియా మిత్రులు ఈ విషయమై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉండగా, భజ్జీ 2016లో చివరిసారి ఆసియాకప్‌లో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. అప్పటి నుంచి సీనియర్ ఆఫ్ స్పిన్నర్‌గా ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. కెరీర్ మొత్తంలో 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 ఆడిన హర్భజన్ వరుసగా 417, 269, 25 వికెట్లు తీశాడు.