
తాజా వార్తలు
రవిశాస్త్రి మాట నిలబెట్టుకుంటాడా.. లేదా?
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమ్ఇండియా కుల్దీప్ యాదవ్‌ను ఆడించే అవకాశాలు లేవని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. 2019 జనవరిలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అతడు చివరి టెస్టు ఆడగా 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో అప్పుడు రవిశాస్త్రి మాట్లాడుతూ విదేశాల్లో టెస్టులు ఆడితే కుల్దీప్ను కచ్చితంగా తీసుకుంటామని తెలిపాడు. ఈ నేపథ్యంలో తాజాగా స్పోర్ట్స్‌తక్‌తో భజ్జీ మాట్లాడాడు. తొలి టెస్టులో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌కు బదులు ఈ చైనామన్ స్పిన్నర్‌ను తీసుకోలేరని చెప్పాడు.
‘కుల్దీప్ 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత సరైన క్రికెట్ ఆడలేదు. ఇటీవల పూర్తి అయిన టీ20 లీగ్‌లోనూ సరైన అవకాశాలు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతడిని తొలి టెస్టుకు ఎంపిక చేయడం జట్టు యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. అతడు చివరిసారి టెస్టు ఆడింది ఆస్ట్రేలియా గడ్డమీదే. అప్పుడు రవిశాస్త్రి మాట్లాడుతూ విదేశీ పిచ్‌లపై తమ తొలి ప్రాధాన్యం కుల్దీప్కేనని చెప్పాడు. ఇప్పుడతడు మాట మీద నిలబడతాడో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం కుల్దీప్ పరిస్థితి చూస్తుంటే టీమ్ఇండియా అడిలైడ్ టెస్టుకు ఎంపిక చేస్తుందని అనుకోవట్లేదు. అయితే జడేజా లేదా అశ్విన్‌ని ఎంపిక చేస్తారు’ అని భజ్జీ పేర్కొన్నాడు.