
తాజా వార్తలు
'కొవిడ్ పార్టీ'కి హాజరయ్యాడు..తనువు చాలించాడు..!
వైరస్‌ను తమాషాగా భావించి 'కొవిడ్ పార్టీ'కి హాజరు
చికిత్స పొందుతూ అమెరికన్ యువకుడి మృతి
టెక్సాస్: కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచదేశాలు వణికిపోతూనే ఉన్నాయి. అయినప్పటికీ కొందరు మాత్రం దీన్ని తేలికగా తీసుకుంటున్నారు. తాజాగా కరోనావైరస్ను తమాషాగా భావించిన ఓ అమెరికన్ యువకుడు 'కొవిడ్ పార్టీ'లో పాల్గొన్నాడు. అనంతరం వైరస్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు కన్నుమూశాడు. ఈ విషయాన్ని వెల్లడించిన అమెరికా వైద్యాధికారులు, యువతకు పొంచివున్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నారు.
'కొవిడ్ పార్టీ' పేరుతో అమెరికాలో కొన్నిచోట్ల యువకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. కరోనా సోకిన వ్యక్తి తనకు వైరస్ సోకిందని పార్టీ ఏర్పాటు చేసి తన మిత్రులను ఆహ్వానిస్తున్నారు. తద్వారా వైరస్‌ను జయించగలమో లేదోనని పార్టీలో పాల్గొని పరీక్షించుకుంటున్న సంఘటనలు అమెరికాలో ఎక్కువయ్యాయి. తాజాగా ఇలాంటి ఘటనే టెక్సాస్‌లో చోటుచేసుకుంది.
టెక్సాస్‌కు చెందిన ఓ యువకుడు(30) కరోనా వైరస్‌ను తేలికగా తీసుకున్నాడు. యువకులపై వైరస్ అంతగా ప్రభావం చూపించదని భావించి కరోనా సోకిన వ్యక్తి ఏర్పాటుచేసిన 'కొవిడ్ పార్టీ'కి హాజరయ్యాడు. అంతేకాదు వైరస్‌ను జయిస్తానంటూ ఊదరగొడుతూ పార్టీలో ఎంజాయ్ చేశాడు. అనంతరం అతనికీ వైరస్ సోకింది. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో స్థానిక సాన్ ఆంటోనియాలోని మెథడిస్ట్ ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో చికిత్సపొందుతూ చివరకు ప్రాణాలు విడిచినట్లు ఆసుపత్రి వైధ్యాధికారి జేన్ ఆప్పిల్బై వెల్లడించారు. అయితే, చికిత్స సమయంలో ఆ యువకుడు తన అనుభవాలను వైద్యులతో పంచుకున్నాడు. 'నేను తప్పుచేశాను. యువకున్నే కదా వైరస్‌ను జయిస్తాననే ధీమాతో కొవిడ్ పార్టీకి హాజరయ్యాను' అని తన చివరి క్షణాల్లో తన బాధను చెప్పుకున్నట్లు వైద్యులు తెలిపారు.
వైరస్ సోకినప్పటికీ వారిలో ఆక్సిజన్ స్థాయి, కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తేనే వారుఎంత అస్వస్థతకు గురయ్యారోననే విషయం బయటపడుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. యువకులమనే ధోరణితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలకే ప్రమాదమనే విషయం ఈ ఘటన స్పష్టం చేస్తోందని అభిప్రాయపడుతున్నారు. కేవలం వృద్ధులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారిపై ఈ కొవిడ్ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే ప్రపంచంలో కోటి 30లక్షల మంది ఈ వైరస్ బారినపడగా 5లక్షల 68వేల మంది ప్రాణాలు కోల్పోయారు.