close
Array ( ) 1

తాజా వార్తలు

వచ్చే ఏడాదికి.. కలిసొచ్చే సూత్రాలు..

వచ్చే ఏడాదికి.. కలిసొచ్చే సూత్రాలు..

కోటి ఆశలతో కొత్త సంవత్సరం రాబోతోంది. గడిచిన ఏడాది కాలం ఎలా ఉన్నా.. రాబోయే 2019లోనైనా ఆర్థికంగా అనుకున్న లక్ష్యాలను చేరేందుకు ప్రయత్నించాలి. ఏం చేయాలి అనేదానికన్నా.. ఎలా చేయాలి అనేదే కీలకం. పొరపాట్లను దిద్దుకుంటూ.. ముందుకు సాగుతూనే ఉండాలి. అప్పుడే ఆర్థిక విజయం మీదవుతుంది.
వచ్చే ఏడాదికి.. కలిసొచ్చే సూత్రాలు..‘ఇక నుంచి ఇలా చేస్తాను..’ చాలామంది కొత్త సంవత్సరం తొలి రోజున ఇలాగే అనుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడంతోనే సరికాదు.. వాటికి ఎంత మేరకు కట్టుబడి ఉంటున్నామన్నదే ఎప్పుడూ ప్రధానం. ఒక ఆలోచన చేయడం తేలికే.. దాన్ని ఆచరణలో పెట్టడమే అత్యంత కష్టం. ఆర్థిక అలవాట్ల విషయంలో దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొత్త ప్రణాళిక వేసుకునే ముందు పాత అలవాట్లను ఒకసారి సమీక్ష చేసుకోవడమూ అవసరం. దీంతోపాటు.. 2019లో పాటించేందుకు ఓ 19 సూత్రాల ఆర్థిక ప్రణాళిక మీ కోసం...

ఆరోగ్యంగా.. ధీమాగా

కొత్త ఏడాదిలో చాలామంది తీసుకునే నిర్ణయాల్లో ‘బరువు తగ్గాలి’ అనేది మొదటి స్థానంలో ఉంటుంది. వ్యాయామం చేయాలి.. నడక కొనసాగించాలి ఇలా చాలా నిర్ణయాలే ఉంటాయి. వ్యాయామశాలలకు వెళ్లి, ఏడాది రుసుము ఒకేసారి చెల్లించేవారూ ఉంటారు. తీరా వారం, పది రోజులు పోయాక కుదరడం లేదు అంటూ మెల్లిగా మానేస్తుంటారు. ఇలా చేయడంకన్నా.. ముందు నడకతో ప్రారంభించి, ఆరు నెలలు అలటవాయ్యాక అప్పుడు ఫీజు చెల్లించి, జిమ్‌లో చేరండి. కానీ, ఈ లోపు ఆరోగ్య బీమాను ఒకసారి సమీక్షించుకోండి. పాలసీ లేకపోతే వెంటనే తీసుకోండి. ఇది ఈ కొత్త సంవత్సరంలో తీసుకునే మొదటి నిర్ణయం కావాలి. మీరు పనిచేసే చోట బృంద బీమా పాలసీ ఉన్నా.. సొంతంగా మరో వ్యక్తిగత పాలసీ తీసుకునేందుకు ప్రయత్నించండి. మీరు మిగిల్చిన ఆరు నెలల జిమ్‌  ఫీజు దీనికి సరిపోతుంది.

టర్మ్‌ తీసుకోండి.. మదుపు చేయండి

జీవిత బీమా పాలసీల విషయంలో చాలామంది అసలు విషయానికన్నా.. పొదుపు, పెట్టుబడులకే ప్రాధాన్యం ఇస్తుంటారు. పన్ను ఆదా కోసం బీమా కాదు.. బీమా తీసుకుంటే పన్ను ఆదా వస్తుందని గుర్తించాలి. పైగా ప్రీమియం ఎక్కువ అనే భావనలోనూ ఉంటారు. సరైన మొత్తానికి జీవిత బీమా తీసుకోవడం ఎప్పుడూ అవసరం. కాబట్టి, ముందుగా చేయాల్సింది టర్మ్‌ బీమా తీసుకోవడం. వార్షికాదాయానికి  కనీసం 12 రెట్ల బీమా ఎప్పుడూ అవసరం. సంప్రదాయ బీమా పాలసీలకన్నా.. టర్మ్‌ పాలసీలకు ప్రీమియం తక్కువే. ఇలా టర్మ్‌ బీమా తీసుకున్నాక.. మీ వద్ద మిగిలిన ప్రీమియం మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. ఏటా టర్మ్‌ పాలసీ ప్రీమియం చెల్లించడం, మిగిలిన మొత్తాన్ని మదుపు చేయడం ఒక అలవాటుగా మారాలి.

బిల్లులు మర్చిపోవద్దు..

విలాసవంతంగా జీవించాలని అందరికీ ఉంటుంది. కానీ, వచ్చే ఆదాయం అందుకు సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. దీనికోసం బడ్జెట్‌ అనేది తప్పనిసరి. అప్పుడే.. మీరు ఏయే ఖర్చులు భరించగలరు.. ఏ ఖర్చు పెట్టకూడదు అనే విషయంలో స్పష్టత వస్తుంది. జీతం రాగానే ముందుగా క్రెడిట్‌ కార్డుతోపాటు, ఇతర బిల్లులన్నీ చెల్లించేయండి. అనవసరంగా ఆలస్యపు రుసుములను చెల్లించకండి.  ఇవి చిన్న మొత్తమైనా ఏడాది మొత్తం లెక్క చూస్తే.. రూ.వేలల్లోనే ఉంటాయి. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించడంలో ఆలస్యం చేస్తే.. క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుంది. తప్పనిసరి బిల్లులు నేరుగా బ్యాంకు ఖాతా నుంచే చెల్లించేలా ఏర్పాటు చేసుకోవడం కూడా మంచిదే.

వాడకుంటే.. రద్దు చేయాలి

కటికి మించి బ్యాంకు ఖాతాలున్నాయా.. అందులో క్రమం తప్పకుండా వాడుతున్నవి ఎన్ని.. లెక్క తీయండి. సాధారణంగా రెండుకు మించి బ్యాంకు ఖాతాలు అనవసరం. కనీస నిల్వల పేరుతో డబ్బు అందులో ఉండి పోతుంది. ఒకవేళ నిల్వ లేకపోతే రుసుములు ఉంటాయి. కాబట్టి, రెండుకు మించి పొదుపు ఖాతాలుంటే.. అంతగా అవసరం లేని వాటిని రద్దు చేసుకునే విషయాన్ని ఆలోచించండి.

వాయిదాల్లో వద్దు...

చేతిలో డబ్బు లేకున్నా.. నెలనెలా కొంత మొత్తం చెల్లించి, అవసరమైన వస్తువులను కొనేందుకు ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. ఇల్లు, కారులాంటి వాటికి ఇది సరైన పద్ధతే. కానీ, ఖరీదైన వస్తువులను కొని, వాయిదాల్లో ఆ అప్పు తీరుస్తామనడంలో అర్థం లేదు. దీనివల్ల ఆర్థిక ప్రణాళిక గాడి తప్పుతుంది. మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడే ఇలాంటి వస్తువులను కొనేందుకు చూడండి. అప్పుల నుంచి బయటపడేందుకు మొదటి పాటించాల్సిన సూత్రం ఇదే.

లక్ష్యం కోసం మదుపు

ఏడాది మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యం ఏమిటి? 2019 ముగిసేనాటికి మీరు ఆర్థికంగా ఎలా ఉండాలనుకుంటున్నారు.. ఈ ప్రశ్న వేసుకోండి. దీనికి సమాధానం కూడా రాసి పెట్టుకోండి. ఇప్పటికే మీరు చేస్తున్న పెట్టుబడి ఎంత? దాన్ని ఈ సారి ఎంత పెంచాలనుకుంటున్నారు..  మరి, ఆ మేరకు మీరు ఖర్చులను తగ్గించుకోవడానికి సిద్ధమేనా.. సమీక్షించుకోండి.

బడ్జెట్‌ వేసుకోవాల్సిందే

దాయం ఎంత వస్తుందన్న విషయంలో అందరికీ స్పష్టత ఉంటుంది. కానీ, ఎంత ఖర్చవుతుందో లెక్క చెప్పడం అంటే కష్టమే. ఇది తెలియాలంటే.. బడ్జెట్‌ అంటూ ఒకటి ఉండాల్సిందే. వచ్చే ఆదాయం, అయ్యే ఖర్చులకు సంబంధించి కచ్చితమైన లెక్కలు ఉండటం ఎప్పుడూ మంచి అలవాటు. ఏ నెలకు ఆ నెల ఎంత ఖర్చవుతుందో లెక్క తేలితేనే.. ఆ ఖర్చులను తగ్గించుకునే మార్గాలను అన్వేషించుకోగలం.

విశ్రాంతంలో ప్రశాంతంగా..

ద్యోగ విరమణ తర్వాత కనీసం 20-25 ఏళ్ల వరకూ జీవన అవసరాల కోసం అవసరమైన నిధి కోసం ఉద్యోగంలో ఉన్నప్పుడే ప్రణాళిక వేసుకోవాలి. చాలామంది ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలు సరిపోతాయనే ఆలోచనతో ఉంటారు. ప్రస్తుత జీవన శైలితో పోలిస్తే.. భవిష్యత్తులో ఖర్చులు మరింత పెరుగుతాయి. దీనికోసం మనం సిద్ధంగా ఉండాలి. అదనంగా వీపీఎఫ్‌, పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌ లేదా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు ప్రారంభించండి. దీర్ఘకాలంలో మంచి రాబడి కోసం ఫండ్లలో సిప్‌ చేయడం మంచి ఆలోచన.

పిల్లల చదువుల మాటేమిటి?

మంచి విద్యా సంస్థలో పిల్లలను చదివించాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. చదువుల ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక తప్పనిసరి అయ్యింది. పిల్లలు పుట్టినప్పటి నుంచే.. వారి ఉన్నత చదువులకు అవసరమైన ఖర్చులను లెక్కవేసి, అందుకు అనుగుణంగా పెట్టుబడులు ప్రారంభించాలి. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే మదుపు ప్రారంభిస్తే.. చిన్న మొత్తాలతోనూ పెద్ద నిధి సాధ్యమవుతుంది. లేకపోతే.. భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకపోవచ్చు.

సమీక్షించుకోండి

మార్కెట్లో అనిశ్చితి, మారిన ఆర్థిక లక్ష్యాలు, ఆదాయంలో తేడాలు.. తదితరాలు మన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను ప్రభావితం చేస్తాయి. ఒకసారి మీ పెట్టుబడులు ఏమున్నాయి? వాటి పనితీరు ఎలా ఉంది? డెట్‌, ఈక్విటీల్లో పెట్టుబడులు మీరు అనుకున్న శాతాల్లోనే ఉన్నాయా? ఒకసారి చూసుకోండి. అవసరమైతే ఆర్థిక నిపుణుడిని సంప్రదించండి.

అర్థం చేసుకోవాలి

ర్థం కాని పెట్టుబడులు వ్యర్థం.. మీరు ఎంచుకునే ప్రతి పెట్టుబడి గురించి మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి. మీ లక్ష్యాలకు అనుగుణంగా ఎంచుకోబోయే పథకాల గురించి అర్థం చేసుకోవాలి. దీనికోసం అవసరమైన పరిశోధన చేయండి. నిపుణుల సలహాలు పాటించండి.

అనిశ్చితి అంటే అవకాశం..

మార్కెట్లో కాస్త హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలంపాటు మదుపు చేసేవారికి ఇదే మంచి అవకాశం అని గుర్తించాలి. అంతేకానీ, భయపడి పెట్టుబడులు ఆపేయడం సరికాదు. ముఖ్యంగా క్రమానుగత పెట్టుబడులు (సిప్‌) చేసేవారు.. ఈ విషయంలో వెనకడుగు వేయరాదు.

తప్పులు సరిదిద్దుకోండి

ఏడాది ఖర్చు ఎంత చేశాం.. అప్పులేమన్నా ఎక్కువ చేశామా? అనవసరమైన కొనుగోళ్ల సంగతేమిటి? ఇలాంటివన్నీ ఒకసారి చూసుకోండి. 2019లో ఆ పొరపాట్లకు తావీయకండి.

అప్పులను వదిలించుకోండి

‘అప్పులందు మంచి అప్పులు వేరయా..’ ఈ సూత్రం ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. ముందుగా మీకు ఉన్న రుణాల జాబితాను తయారు చేయండి. విలువ పెరిగే ఆస్తుల కోసం తీసుకున్నవే మంచి అప్పులు. అవి కాకుండా.. అధిక వడ్డీని చెల్లించే రుణాలు ఏమున్నాయో చూడండి. క్రెడిట్‌ కార్డు రుణం, వ్యక్తిగత రుణాలు ఇలాంటి కోవలోకే వస్తాయి. ఈ అప్పులను వీలైనంత తొందరగా వదిలించుకోవాలి. మీరు చెల్లించే వడ్డీ 36శాతం ఉంటే.. అంత రాబడిని సాధించడం ఏ పెట్టుబడివల్లా కాదు. ఇలాంటి అప్పులను చెల్లించేందుకు మీ వద్ద ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లు, చేతిలో ఉన్న డబ్బు వాడుకోండి. క్రెడిట్‌ కార్డుపై రూ.50,000 బాకీ ఉన్నారు. దీనికి ఏడాదికి 36శాతం వడ్డీ అంటే.. రూ.18,000 అవుతుంది. ఈ రూ.50,000ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు 8% వడ్డీ చొప్పున రూ.4వేలే వస్తాయి. రూ.14,000 నష్టం. అందుకే, అప్పులు వదిలించుకున్నాకే.. డిపాజిట్లు చేయడం మేలు.

స్కోరు చూసుకున్నారా?

ప్పటికే రుణం తీసుకున్నా.. క్రెడిట్‌ కార్డు వాడుతున్నా.. ఒకసారి మీ క్రెడిట్‌ స్కోరు, నివేదిక ఎలా ఉందో పరిశీలించండి. మీ చెల్లింపుల తీరు సరిగా లేకపోతే స్కోరు తగ్గిపోతుంది. కొత్త రుణాలు తీసుకోవడం కష్టం అవుతుంది. ముందుగానే క్రెడిట్‌ స్కోరు గురించి తెలుసుకోవడం ద్వారా పొరపాట్లను సరిదిద్దుకునే వీలుంటుంది. సిబిల్‌తోపాటు, పైసాబజార్‌.కాం తదితర వెబ్‌సైట్లలో ఈ నివేదిక పొందవచ్చు.

అత్యవసరంలో..

నీసం 3-6 నెలల ఖర్చులకు సరిపోయే డబ్బు ఎప్పుడూ చేతిలో ఉండాల్సిందే. ఇందుకోసం అత్యవసర నిధి సిద్ధం చేసుకోండి.

సిప్‌.. పెంచితేనే లాభం

మీరు ఇప్పటికే మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ చేస్తున్నారా.. అయితే, ఏటా కొంత మొత్తాన్ని పెంచేందుకు ప్రయత్నించాలి. మీ ఆదాయాన్ని బట్టి, మీ పెట్టుబడిని ఎంతశాతం పెంచాలన్నది నిర్ణయించుకోవాలి. అప్పుడే మరింత నిధి సమకూరుతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల రాము నెలకు రూ.2,000 చొప్పున 12శాతం రాబడి వచ్చేలా మదుపు చేస్తున్నాడనుకుందాం. అతనికి 60 ఏళ్లు వచ్చేనాటికి రూ.61,6,1,946 జమ అవుతుంది. అదే అతను ఏటా తన పెట్టుబడిని 8% చొప్పున పెంచుకుంటూ వెళ్లాడనుకోండి.. ఇదే వ్యవధికి రూ.1,33,70,962 సమకూరే వీలుంది. చూశారుగా.. ఏటా పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లడం వల్ల దాదాపు రూ.72లక్షలు అదనంగా సమకూరాయి.

ఆదాయపు పన్ను మర్చిపోకండి

ర్థిక ప్రణాళికలో కీలకమైన ఆదాయపు పన్ను గురించి ఎప్పుడూ మర్చిపోవద్దు. కేవలం పన్ను ఆదా కోసం మీ ఆర్థిక ప్రణాళికలో ఇమడని పథకాలను ఎంపిక చేసుకోకండి. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అనువైన పన్ను ఆదా పథకాల్లో మదుపు చేయండి. దీనివల్ల ఒకేసారి ఆర్థిక భారం ఉండదు. పన్ను ఆదా ఒక్కటే కాదు.. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి తోడ్పడే పథకాలను ఎంచుకోవడమూ తప్పనిసరి.

ఖర్చు పెట్టని రోజు..

‘వారంలో ఒక రోజు రూపాయి కూడా ఖర్చు పెట్టను’ అనే స్వీయ నిబంధన విధించుకోండి. వారాంతాలు కచ్చితంగా బయటకు వెళ్లే అలవాటు ఉంటే.. ఒక వారం ఇంట్లోనే ఉండండి. ఉదాహరణకు మీరు వారాంతంలో రూ.2,000 ఖర్చు చేస్తారనుకుందాం.. ఒక వారం ఖర్చు చేయకుండా మిగిల్చిన మొత్తాన్ని పెట్టుబడికి మళ్లించండి. ఇలా నెలకు రూ.2,000 కనీసం 12% రాబడి వచ్చేలా మదుపు చేస్తే.. 15 ఏళ్లలో దాదాపు రూ.10,00,000 ఆర్జించేందుకు వీలవుతుంది.

నిపుణుల మాట విందాం..

క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగించిన వారికి ఈ ఏడాది బాగానే కలిసొచ్చిందని చెబుతున్నారు పలు రంగాలకు చెందిన ఆర్థిక నిపుణులు. కొత్త సంవత్సరంలో పాలసీదారులు, మదుపరులు ఏం చేస్తే బాగుంటుందనే విషయాలను ఇలా వివరిస్తున్నారు..

కొత్త యులిప్‌లు తోడుగా..

వచ్చే ఏడాదికి.. కలిసొచ్చే సూత్రాలు.. ఏడాదిలో కొత్తతరం యులిప్‌లు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ రుసుములు ఉండటంతో ఇవి పాలసీదారులను ఆకట్టుకున్నాయి. మోర్టాలిటీ ఛార్జీలను వెనక్కి ఇవ్వడంలాంటి వెసులుబాట్లతో యులిప్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు యులిప్‌ ఫండ్లు.. ఇతర పెట్టుబడులతో సమానంగా రాబడి ఇచ్చిన సంగతి  గమనించవచ్చు. ప్రస్తుతం పాలసీ ఛార్జీలు/ఖర్చులు తగ్గిన నేపథ్యంలో కొత్త పాలసీదారులకు యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు (యులిప్‌)లు మంచి అవకాశాన్ని ఇస్తున్నాయి. ఆదాయపు పన్ను రాయితీ, పెట్టుబడి వృద్ధికి యులిప్‌లను పరిశీలించవచ్చు. ఈ పాలసీలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చేశాయి. ఆర్థిక లక్ష్యాల సాధనలో యులిప్‌ల విషయాన్ని ఆలోచించాలి. 
- సంపత్‌ రెడ్డి, సీఐఓ, 
బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

అవకాశాలు అనేకం..

వచ్చే ఏడాదికి.. కలిసొచ్చే సూత్రాలు..భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి దశలో కొనసాగుతోంది. ఆర్థిక సంస్కరణలపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో పలు రంగాలు అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగంలోకి వస్తున్నాయి. దీంతో కంపెనీల ఆధారిత పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయి.  అనేక కొత్త రంగాలు మదుపరులకు అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలో రూ.24.03లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. భారతీయ మదుపరుల అండతో 2025 నాటికి ఇది రూ.100 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. 
- అశుతోష్‌ బిష్ణాయ్‌, ఎండీ-సీఈఓ, 
మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌

క్రమశిక్షణతోనే లాభం

వచ్చే ఏడాదికి.. కలిసొచ్చే సూత్రాలు.. ఏడాది ఫిబ్రవరి, మార్చి తర్వాత సెప్టెంబరు, అక్టోబరులో మార్కెట్‌లో ఆటుపోట్లు వచ్చాయి. ఈ పరిస్థితిని చూసి భయపడకుండా మార్కెట్లో కొనసాగిన వారికి తర్వాత వేగంగా రాబడులు అందిన విషయం గమనించాలి. 2019లో కూడా ఇలాంటి సందర్భాలు రావచ్చు. మంచి యాజమాన్యం, పనితీరు బాగున్నవీ, రాజకీయ సంబంధాలు లేనివీ, భారత ఆర్థికాభివృద్ధితోపాటు ముందుకు నడిచే సంస్థల షేర్లను ఎంపిక చేసుకొని మదుపు చేయాలి. అప్పుడే 2019లో పెట్టుబడుల నుంచి అధిక మొత్తంలో రాబడి సంపాదించే అవకాశం ఉంది. 
- సిద్ధార్థ రస్తోగి, మేనేజింగ్‌ డైరెక్టర్‌, 
అంబిత్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌

దీర్ఘకాలం కొనసాగితే..

వచ్చే ఏడాదికి.. కలిసొచ్చే సూత్రాలు..ర్థిక, ఆరోగ్య పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ప్రస్తుతం, భవిష్యత్తు బాధ్యతలను విశ్లేషించుకోవాలి. సాధ్యమైనంత తొందరగా జీవిత బీమా పాలసీ తీసుకోవడం ద్వారా తక్కువ ప్రీమియంతో లభిస్తుంది. చిన్న వయసులోనే తగిన మొత్తానికి బీమా పాలసీని ఎంచుకోవడం ఇప్పుడు తక్షణావసరం. 2019లో మరిన్ని సులభమైన పాలసీలు వచ్చే అవకాశం ఉంది. జీవిత బీమా పాలసీలు తీసుకునే వారు దీర్ఘకాలం ఆ పాలసీలను కొనసాగించేందుకు వీలుగా అవసరమైన అవగాహన పెంచడంలాంటివి మరింత పెరుగుతాయి. సాంకేతికతను వినియోగించడం ద్వారా బీమా పాలసీలను కూడా ఇతర పథకాల మాదిరిగా సులభంగా కొనుగోలు చేసేందుకు కొత్త ఏడాదిలో మార్పులు వస్తాయని అనుకోవచ్చు. 
- పంకజ్‌ రజ్దాన్‌, ఎండీ, సీఈఓ, 
ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.