close

తాజా వార్తలు

Updated : 26/11/2020 16:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నివర్‌ ఎఫెక్ట్‌: ఏపీలో భారీ వర్షాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: నివర్‌ తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, గుంటూరు తదితర జిల్లాల్లో బుధవారం ఉదయం నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

తిరుమలలో వర్ష బీభత్సం
తిరుమలలో నివర్‌ తుపాను ప్రభావం అధికంగా ఉంది. బుధవారం ఉదయం ప్రారంభమైన వర్షం ఏకధాటిగా కురుస్తోంది. ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. తిరుమలకు వస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు దారికి అడ్డంగా పడిన చెట్లను తొలగించి స్తంభించిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. తుపాను కారణంగా తిరుపతికి పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ మేరకు ప్రయాణికులకు విమానయాన సంస్థలు సందేశాలు పంపాయి. తుపాను దృష్ట్యా చిత్తూరు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పు ప్రాంతాల్లో్ ప్రభావం ఉంటుందన్న అంచనాతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని 340 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలో పుల్లూరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పుల్లూరు క్రాస్‌ నుంచి సుమారు 20 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో కపిలతీర్థం జలపాతంలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

తిరుపతిలోని శ్రీరామ్‌నగర్‌లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. కపిలతీర్థంలో కాలువను ఆనుకొని ఉన్న పలుకాలనీల్లోకి వరద నీరు చేరింది. తిరుపతి అర్బన్  శ్రీనివాసం 11కెవీ ఉపకేంద్రం పరిధిలో రాత్రి 12.15 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో వందల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. కమలాపురంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లపైకి నీరు చేరిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేణిగుంట- కడప జాతీయ రహదారిపై కడప జిల్లా సరిహద్దులో రోడ్లు దెబ్బతిన్నాయి.

నెల్లూరులో..
నివర్‌ తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వానకు ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పలు చోట్ల ప్రధాన రహదారులన్నీ కోతకు గురయ్యాయి. మరోవైపు తీరప్రాంతంలో గాలులకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. డైకస్‌ రోడ్డు నుంచి రామకోటయ్యనగర్‌ వరకు రహదారులపై చెట్లు కూలాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని సోమశిల జలాశయం 75 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నిండింది. జలాశయానికి ఎగువ నుంచి 13వేల క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా.. 45వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పెన్నా పరివాహక ప్రాంతాల్లోని పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరుతోపాటు గూడూరు, నాయుడుపేటలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాల్లోకి తరలించారు. సుమారు 100 పునరావాస కేంద్రాల్లో రెండు వేల మందికి వసతి కల్పిస్తున్నారు.

నివర్‌ తుపాను.. అన్నదాతల్లో గుబులు
గుంటూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా నూజండ్ల 17.6, దుగ్గిరాల 16.4, రేపల్లె 15.4, అమరావతి, నిజాంపట్నంలలో 10.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈదురుగాలులకు కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గుంటూరు నగరంలోనూ ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు పడుతున్నాయి. వేమూరు, చుండూరు, అమృతలూరు, రెంటచింతల, భట్టిప్రోలు, పెదనందిపాడు, దాచేపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. తుపాను ప్రభావం మరింత పెరిగే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక పొలాల్లో వరిపంట పాడైపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల్లో పంట కోతలు చేపట్టాల్సిన సమయంలో తుపాను అన్నదాతల్లో గుబులు రేకెత్తిస్తోంది.

కడపలో..

కడపజిల్లాలోనూ నివర్‌ తుపాను ప్రభావం భారీగానే కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీని ప్రభావం ఎక్కువగా రైల్వేకోడూరు నియోజకవర్గంపై కనిపిస్తోంది. జిల్లాలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుతోంది. కడప నగరంలోని భారీ వృక్షం వర్షం ధాటికి నేలకూలింది. రహదారికి అడ్డంగా పడిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో మున్సిపల్‌ అధికారులు నేలకూలిన చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన