
తాజా వార్తలు
మహిళను బూటుకాలుతో ఎందుకు తన్నారు?
144 సెక్షన్ అమలుపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం
అమరావతి: రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144, పోలీస్ యాక్టు 30 అమలు చేయడంపై అమరావతి రైతులు, మహిళలు, న్యాయవాదులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసింది. దీనిపై అడ్వొకేట్ జనరల్ దాదాపు గంట పాటు వాదనలు వినిపించారు. 2014 నుంచి అమరావతిలో 144 సెక్షన్ ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. 144 సెక్షన్ను రాజధానిలో పొడిగించినట్టు వివరించారు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయనే ఉద్దేశంతోనే రైతులను అడ్డుకున్నట్టు ఏజీ తెలిపారు.
అయితే, రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. 610 మందిపై కేసులు పెట్టడంపైనా న్యాయమూర్తులు ఏజీని వివరణ అడిగారు. బెంజ్ సర్కిల్ వద్ద ర్యాలీకి వెళ్తున్నందునే అరెస్టు చేశామని ఆయన బదులిచ్చారు. రాజధానిలో పోలీసులు భారీ స్థాయిలో కవాతు ఎందుకు నిర్వహించారు? మందడంలో మహిళను పోలీసులు బూటు కాలుతో ఎందుకు తన్నారు? ఆందోళనలో మహిళల నోరు ఎందుకు నొక్కారు? అంటూ న్యాయమూర్తులు ఏజీని ప్రశ్నించారు. మగ పోలీసులు మహిళలను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని నిలదీశారు. దీనికి ఏజీ స్పందిస్తూ.. శాంతిభద్రతల సమస్యలు వస్తాయనే అమరావతిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. సమగ్రంగా ప్రమాణపత్రం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. అనంతరం దీనిపై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.