close

తాజా వార్తలు

Published : 06/11/2020 13:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధూమపానం.. ప్రీమియం భారం..

ధూమపానం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాదు..   ఆర్థికంగానూ ఎంతో నష్టం.. సిగరెట్లు తదితరాలను కొనేందుకు డబ్బులు ఖర్చు కాగా.. మరోవైపు తరచూ అనారోగ్యం బారిన పడుతుంటారు. దీనికోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిందే. ముఖ్యంగా జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవాలనుకుంటే.. అధిక మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. వాస్తవాలు దాచి, పాలసీ తీసుకున్నా.. తర్వాత నిజం బయటపడితే.. క్లెయిం వేళలో చిక్కులు వస్తాయి. కొన్ని రకాల ఉద్యోగాల్లో ఎలాంటి రిస్కూ ఉండదు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, బ్యాంకర్లు, మార్కెటింగ్‌ కన్సల్టెంట్ల వంటివి ఇందుకు ఉదాహరణ. మరికొన్ని ఉద్యోగాల్లో ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. నిర్మాణ కార్మికులు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసేవాళ్లను బీమా సంస్థలు వేరుగానే పరిగణిస్తాయి. తక్కువ రిస్కు ఉన్న వారితో పోలిస్తే.. అధిక రిస్కు ఉన్న వారికి బీమా ప్రీమియం అధికంగానే ఉంటుంది. చేస్తున్న ఉద్యోగాలను బట్టి, పాలసీదారులను విభజించినట్లే.. బీమా సంస్థలు ధూమపానం చేసేవారు, ధూమపానం చేయని వారు అని రెండు వేర్వేరు విభాగాలుగా విభజించాయి. అండర్‌ రైటింగ్‌ నిబంధనలు, రిస్కును బట్టి, ప్రమాదకరమైన ఉద్యోగాలు చేసే వారికన్నా.. పొగ తాగే వ్యక్తికే ఎక్కువ ప్రీమియం విధిస్తున్నాయి. "ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం, భారత్‌లో దూమపానం చేసేవారు సుమారుగా 12 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలోని మొత్తం పొగతాగే వారి సంఖ్యలో ఇది 12శాతానికి సమానం. అంతేకాకుండా పొగాకు వాడకం కారణంగా భారత్‌లో ఏటా 10 లక్షల మందికి పైగా ప్రజలు మరణిస్తున్నట్లూ నివేదిక పేర్కొంది. ఇంత భారీ స్థాయిలో పొగాకు వినియోగదారులు ఉండటం వల్లే.. ప్రపంచ మొత్తం జనాభాలో మన దేశ వాటా 20 శాతంలోపే అయినప్పటికీ.. ప్రపంచంలోని మొత్తం గుండె జబ్బుల్లో 83 శాతం మన దేశంలోనే నమోదవుతున్నాయని ఇండియన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ చెబుతోంది. " 

కారణమేమిటి?
ధూమపానం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. అధిక రిస్కు ఉన్న ఉద్యోగాల్లో మరణాలకు అవకాశం ఉన్నప్పటికీ.. ప్రాణానికి ముప్పుగా పరిణమించే ఊపిరితిత్తుల కేన్సర్, స్ట్రోక్స్, హృదయ సంబంధ వ్యాధులు, క్షయ వంటి రోగాలకు ప్రధాన కారణం ధూమపానమే అని వెల్లడయ్యింది. అంటే, మరణించడానికి అధిక అవకాశాలున్న వ్యక్తులు ఎక్కువ మొత్తంలో జీవిత బీమా ప్రీమియాన్ని చెల్లించాల్సి వస్తుందన్నమాట. పొగ తాగని వారితో పోలిస్తే, పొగ తాగే వ్యక్తులు తమ జీవిత బీమా పాలసీ కోసం సగటున 50శాతం అధికంగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ధూమపానం అలవాటున్న వ్యక్తి.. ధూమపానం చేయని వారికంటే నెలకు సుమారు రూ.650-రూ.850 వరకూ అధికంగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. అంటే.. ఏడాదికి దాదాపు రూ.8,000 నుంచి రూ.10,000ల వరకూ లెక్క తేలుతుంది. 

దాపరికం పనికిరాదు..
పొగతాగే వారికి జీవిత బీమా ప్రీమియాన్ని నిర్ణయించేందుకు బీమా సంస్థలు గడిచిన నెల రోజుల్లో పొగాకు వాడకం సగటు వివరాలు తెలుసుకుంటాయి. సిగార్లు, సిగరెట్లు లేదా పొగాకు నమలడం సహా పొగాకు సంబంధ ఉత్పత్తుల వాడకం ఏదైనా దీనికిందకే వస్తుంది. ఈ సమాచారం ఆధారంగా, పాలసీ తీసుకుంటున్న వ్యక్తి అప్పుడప్పుడూ ధూమపానం చేస్తారా? లేదంటే పూర్తి స్థాయిలోనా అనేది బీమా సంస్థ నిర్ణయిస్తుంది. ఇతరత్రా పాలసీ నిబంధనలను పరిశీలనలోకి తీసుకొని, తర్వాత జీవిత బీమా పాలసీపై ప్రీమియం ఎంత మొత్తం అధికంగా విధించాలి (లోడింగ్‌) అనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది. ధూమపానం చేసే వ్యక్తులు చాలామంది జీవిత బీమా పాలసీలకు అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుండటంతో ఆ విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. సాధారణంగా బీమా సంస్థలు పాలసీనిచ్చేటప్పుడు వైద్య పరీక్షల కోసం అడుగుతుంటాయి. బీమా సంస్థతో మౌఖికంగా అబద్ధం చెప్పినా.. వైద్య పరీక్షల్లో నికోటిన్‌ జాడలను దాచిపెట్టడం సాధ్యం కాకపోవచ్చు. 

కుటుంబానికి రక్షణగా..
ధూమపానం మంచి అలవాటు కాదు. కానీ, కొంతమంది దీన్ని తమ జీవితంలో ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. ఇలాంటివారు.. తమ గురించి తాము ఎంత ఆలోచిస్తున్నారో.. కుటుంబం బాగోగులు, ఆర్థిక భరోసా గురించీ అంతే ముఖ్యమని గుర్తించాలి. తాను లేకున్నా కుటుంబానికి అండగా ఉండేలా మంచి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవడం అవసరం. ఇలాంటి వారు అధిక ప్రీమియం సాకుగా చూపించి, బీమాను మొత్తంగా తీసుకోవడమే మానేస్తుంటారు. ఇది సరికాదు. ఇప్పటికే కొన్ని బీమా సంస్థలు పొగతాగే వారికోసం ప్రత్యేకంగా టర్మ్‌ పాలసీలనూ అందిస్తున్నాయి. ఇందులో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రత్యేకంగా పొగతాగే వ్యక్తుల కోసం పీఓఎస్‌-ఐప్రొటెక్ట్‌ స్మార్ట్‌ ప్లాన్‌ అనే టర్మ్‌ పాలసీ తీసుకొచ్చింది. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ సీ2పీపీ లైఫ్‌ ఆప్షన్, మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ టర్మ్‌ ప్లాన్, టాటా ఏఐఏ మహా సురక్షా, బజాజ్‌ అలయంజ్‌ స్మార్ట్‌ ప్రొటెక్ట్‌ గోల్‌ లాంటివి చెప్పుకోవచ్చు. అయితే, వీటిని తీసుకునేందుకు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది. 

- సంతోశ్‌ అగర్వాల్, చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్, www.Policybazaar.comTags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని