
తాజా వార్తలు
ఆ ప్యాకేజీ ఎవరికి అందింది?: కేటీఆర్
హైదరాబాద్: కరోనా కారణంగా వాణిజ్యంతో పాటు అనేక రంగాలు దెబ్బతిన్నాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మారియట్ కన్వెన్షన్ సెంటర్లో ‘‘హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్’’ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు, భవన నిర్మాణ సంస్థల యజమానులు, పారిశ్రామికవేత్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. లాక్డౌన్ సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి అనేక మంది వ్యాపారవేత్తలు విరాళాలిచ్చారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కొన్ని నెలల లాక్డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడుతోందని వివరించారు. ఇప్పడు హైదరాబాద్ నలువైపులా షాపింగ్ మాల్స్ వచ్చాయని.. అన్నివైపులా హైదరాబాద్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాకముందు విద్యుత్ కోసం ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు జరిగేవని.. ఇప్పుడు అలాంటివి ఎక్కడా జరగడం లేదని పేర్కొన్నారు. తాను చదువుకునే రోజుల్లో హైదరాబాద్లో కర్ఫ్యూల కారణంగా సెలవులు వచ్చేవని గుర్తు చేశారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత అరగంట కూడా కర్ఫ్యూ విధించలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది?అని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు దుష్ఫలితాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని.. నోట్ల రద్దు చిరువ్యాపారులను దారుణంగా దెబ్బతీసిందన్నారు. కేంద్రం విధానాల కారణంగానే 8 వరుస త్రైమాసికాల్లో జీడీపీ క్షీణించిందన్నారు.