పడుతూ లేస్తూ.. నిలిచేదెవరో..?
close

తాజా వార్తలు

Updated : 13/10/2020 15:25 IST

పడుతూ లేస్తూ.. నిలిచేదెవరో..?

నేడు చెన్నైని ఢీకొట్టనున్న వార్నర్‌సేన

ఇంటర్నెట్‌ డెస్క్‌: హోరాహోరీగా సాగుతున్న టీ20 లీగ్‌లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీలో 29వ మ్యాచ్‌లో హైదరాబాద్‌×చెన్నై జట్లు నేడు తలపడనున్నాయి. వరుస ఓటములతో అతి కష్టంగా నెట్టుకొస్తున్న చెన్నై ఓ వైపు.. పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న హైదరాబాద్‌ మరోవైపు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొంది ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. కాగా.. లీగ్‌ దశను దాటాలంటే చెన్నై 7 మ్యాచుల్లో 6 విజయాలు సాధించి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాలేంటో ఓసారి చూద్దాం..

విజయ్‌శంకర్‌ ఆల్‌రౌండ్‌ షో ఎక్కడ..?
వార్నర్‌సేన అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్నప్పటికీ కీలక సమయంలో ఒత్తిడి వాళ్లను చిత్తు చేస్తోంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌ గాడిలో పడింది. బౌలింగ్‌లో భువనేశ్వర్‌కుమార్‌ లేని లోటు కనిపిస్తోంది. ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌ శర్మ పెద్దగా రాణించలేకపోతున్నారు. విజయ్‌శంకర్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన ఇకనైనా చూపించాల్సి ఉంది. యువ బ్యాట్స్‌మన్‌ ప్రియమ్‌ గార్గ్‌ సైతం కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో రాణించాడు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. అసలు ఈ మ్యాచ్‌లో విజయ్‌శంకర్‌, ప్రియమ్‌‌ జట్టులో ఉంటారా అన్నదీ అనుమానమే. విజయ్‌శంకర్‌ స్థానంలో మరో యువ ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ సమద్‌ జట్టులోకి వచ్చే అవకాశమూ లేకపోలేదు. సమద్‌ బ్యాటింగ్‌లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో హైదరాబాద్‌ గెలుపు ముంగిట్లో బోల్తాపడింది. రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ తెవాతియా, రియాన్‌ పరాగ్‌ అనూహ్యంగా మ్యాచ్‌ను మలుపు తిప్పారు. హైదరాబాద్‌ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఆ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లలో హైదరాబాద్‌ బౌలర్లు ఒత్తిడిని జయించలేకపోయారు. చెన్నైపై గెలవాలంటే మాత్రం వాట్సన్‌, డుప్లెసిస్‌ను త్వరగా ఔట్‌ చేసే మంత్రాన్ని హైదరాబాద్‌ బౌలర్లు పఠించాల్సిందే.

చెన్నైకి రాయుడే దేవుడు..

చెన్నైని మొదటి నుంచి ఇబ్బంది పెడుతున్న సమస్య మ్యాచ్‌ ఫినిషర్‌ లేకపోవడం! ఎందుకంటే ధోనీ ఆత్మవిశ్వాసంతో లేడు. అలాంటప్పుడు పోరాడాల్సిన కేదార్‌ జాదవ్‌ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌ చేరుకుంటున్నాడు. బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఇబ్బందులకు గురిచేస్తున్న ధోనీసేన బ్యాటింగ్‌లో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. ఓపెనర్లపైనే బ్యాటింగ్‌ ఆర్డర్‌ మొత్తం ఆధారపడి ఉంది. అందుకే ప్రత్యర్థులు సైతం ఓపెనర్లపైనే దృష్టి పెడుతున్నారు. రాయుడు తిరిగి ఫామ్‌ అందుకున్నట్లు కనిపిస్తున్నాడు. మిడిలార్డర్‌ పేలవంగా ఉన్న చెన్నైకి అతని నుంచి ఒక భారీ ఇన్నింగ్స్‌ అవసరం. ఈ మ్యాచ్‌ ఓడిపోతే చెన్నై ప్లేఆఫ్‌ అవకాశాలు సన్నగిల్లుతాయి. కాబట్టి హైదరాబాద్‌ బౌలర్లను చెన్నై ఎలా ఎదుర్కొని నిలబడుతుందన్నదే ఆసక్తికరం.

ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 13 సార్లు తలపడగా అందులో 9 విజయాలతో చెన్నై పైచేయి సాధించింది. నాలుగింట్లో హైదరాబాద్‌ గెలిచింది. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో మాత్రం చెన్నైని వార్నర్‌సేన మట్టికరిపించింది. దుబాయ్‌ మైదానంలో చివరిగా జరిగిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలుపొందింది. కాబట్టి టాస్‌ చాలా కీలకంగా మారనుంది.

జట్లు అంచనా..

హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), బెయిర్‌స్టో, మనీశ్‌పాండే, విలియమ్సన్‌, ప్రియమ్‌ గార్గ్, విజయ్‌శంకర్‌, అభిషేక్‌శర్మ, రషీద్‌ఖాన్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌, ఖలీల్‌ అహ్మద్‌

చెన్నై: షేన్‌ వాట్సన్‌, జగదీశన్‌, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, సామ్‌ కరన్‌, ధోనీ(కెప్టెన్‌), రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రావో, దీపక్‌ చాహర్‌, కర్ణ్‌ ‌శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని