
తాజా వార్తలు
అందుకు నేనింకా చిన్నవాడినే : గంగూలీ
ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టడానికి తొందర లేదు
ఇంటర్నెట్డెస్క్: ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టడానికి తాను ఇంకా చిన్నవాడినేనని, ఇప్పుడే తనకు ఆ తొందర లేదని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ సారథి సౌరభ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఐసీసీ ఛైర్మన్గా శశాంక్ మనోహర్ ఇటీవల వైదొలిగిన సంగతి తెలిసిందే. అంతకుముందే ఆ పదవి రేసులో గంగూలీ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఆ స్థానంపై కన్నేసిన ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ కొలిన్ గ్రేవ్స్ ఇప్పుడు ఆ రేసులో వెనుకబడ్డాడు. ఐసీసీ ఛైర్మన్ విషయంపై ఇండియాటుడేతో మాట్లాడిన దాదా పలు విషయాలు వెల్లడించాడు.
‘ఐసీసీ ఛైర్మన్ పదవి గురించి నాకు తెలియదు. అది బోర్డు సభ్యులందరూ కలిసి తీసుకునే నిర్ణయం. అలాగే ఇప్పుడు ఐసీసీ నిబంధనలు కూడా మారాయి. ఒకవేళ ఎవరైనా ఆ పదవిలో కొనసాగాలంటే ఆ వ్యక్తి తన దేశం తరఫున బోర్డులోని పదవుల నుంచి తప్పుకోవాలి. ఇంతకుముందులా రెండు పదవులు చేపట్టే అవకాశం లేదు. అది బీసీసీఐ చేసిన మార్పు కాదు, ఐసీసీ చేసిందే. అయితే, ఇప్పుడున్న బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. ఇక్కడ పదవిలో ఉంటూనే ఐసీసీ లేదా ఏసీసీలో కొనసాగొచ్చు. కానీ, బీసీసీఐలో మాత్రం రెండు పదవులు చేపట్టకూడదు. అలాగే ఐసీసీ నిబంధనల ప్రకారం అక్కడా, ఇక్కడా రెండు పదవులు కలిగి ఉండొద్దు’ అని గంగూలీ వివరించాడు.
చివరగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను బీసీసీఐ నుంచి తప్పుకోవడం కూడా సరికాదని దాదా పేర్కొన్నాడు. ‘భారత క్రికెట్ బోర్డును ఇలా మధ్యలో వదిలి వెళ్లడం, లేదా వెళ్లాల్సిన పరిస్థితులు రావడం సరైనవో కాదో నాకు తెలియదు. కానీ, ఐసీసీ ఛైర్మన్ పదవికి మాత్రం తొందరపడట్లేదు. అందుకు నేనింకా చిన్నవాడిని. అవి ఎంతో గౌరవప్రదమైన పదవులు. జీవితంలో ఒక్కసారే చేసే పనులు. ఇంతకుముందు ఆ పదవుల్లో కొనసాగిన గొప్ప పాలకులంతా ఒక్కొక్కసారే ఆయా బాధ్యతలు చేపట్టారు. క్రీడలకు సంబంధించినంత వరకు ఇతరుల కన్నా నాకు మరిన్ని ఎక్కువ విషయాలు తెలుసు. ఎందుకంటే నా జీవితమంతా ఆటతోనే ముడిపడి సాగింది. కాబట్టి, ఐసీసీ పదవిని చేపట్టాల్సి వస్తే అది బోర్డు సభ్యులందరి నిర్ణయం ప్రకారమే జరగుతుంది’ అని దాదా సెలవిచ్చాడు.