
తాజా వార్తలు
చెన్నై: కోట్ల మంది భారతీయుల కలలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2.. చివరి దశలో తడబడింది. అయితేనేం.. మన ఇస్రో శాస్త్రవేత్తల ముందు ఎన్నో సవాళ్లను, అనుభవాలను మిగిల్చింది. జాబిల్లి ఉపరితలాన్ని ఆఖరి నిమిషంలో గట్టిగా ఢీకొట్టిన విక్రమ్ ల్యాండర్ జాడ కనుక్కోవడంలో ఇటు ఇస్రో అటు నాసా తలమునకలయ్యాయి. కానీ, దాని ఆచూకీ చిక్కలేదు. అయినా ప్రయత్నాలు కొనసాగించాయి. ఎట్టకేలకు దాని కచ్చితమైన జాడ ఒక భారతీయుడికే చిక్కింది. చెన్నైకి చెందిన ఒక సాధారణ ఇంజినీరు షణ్ముగ సుబ్రహ్మణియన్ ఇచ్చిన ఆధారమే దాని జాడను కనుక్కోవడంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు కీలకమైంది. చివరికి నాసా విక్రమ్ జాడను గుర్తించింది.
సాధారణ మెకానికల్ ఇంజినీరు...
చెన్నైకి చెందిన షణ్ముగ సుబ్రహ్మణియన్.. ఒక సాధారణ మెకానికల్ ఇంజినీరు. అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్న వ్యక్తి. టెక్నికల్ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నారు. అలాగే సాంకేతిక అంశాలపై బ్లాగ్ రాస్తుంటారు. ఇటు చంద్రయాన్-2తో గానీ, అటు నాసాతో గానీ ఇతడికి ఎలాంటి సంబంధం లేదు. అయితే విక్రమ్ జాడను నాసా కూడా కనుక్కోలేకపోవడం అతన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. మనమెందుకు ఓ ప్రయత్నం చేయొద్దని అనుకున్నారు. సవాల్‌గా స్వీకరించి లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించారు.
ఎలా కనుగొన్నాడు...
విక్రమ్ ల్యాండర్.. విఫలమైన తర్వాత నాసా దాని జాడ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో లూనార్ రీకనైసాన్స్ ఆర్బిటర్(ఎల్ఆర్వో) కెమెరాతో తీసిన కొన్ని చిత్రాలను సెప్టెంబరు 17న విడుదల చేశారు. కానీ, అప్పుడు ల్యాండర్ దిగాల్సిన ప్రాంతంలో చీకటిగా ఉండడంతో నాసా ఎలాంటి ఆనవాళ్లను గుర్తించలేకపోయింది. కానీ షణ్ముగ అవే చిత్రాలను ఆధారం చేసుకున్నారు. విక్రమ్ ల్యాండర్ ప్రయోగానికి ముందు జులై 16న తీసిన చిత్రాన్ని.. సెప్టెంబరు 17న నాసా విడుదల చేసిన చిత్రాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. దీనికోసం అతను ఎంతగానో శ్రమించారు. సాఫ్ట్వేర్ డెవలసింగ్పై కూడా పట్టు ఉండడంతో ఆ సాంకేతిక జ్ఞానం అతడికి ఎంతగానో ఉపయోగపడింది. నాసా చిత్రాల్ని పిక్సెల్ టు పిక్సెల్ అధ్యయనం చేశారు. ల్యాండర్ సంబంధాలు కోల్పోయినప్పుడు ఉన్న వేగం, ఎత్తు ఆధారంగా కొన్ని లెక్కలు వేసి అది దిగాల్సిన ప్రాంతం.. దాని పరిసరాలను అధ్యయనం చేశారు. లక్షిత ప్రదేశానికి 1కి.మీ దూరంలో ఉపరితలంపై మార్పులు ఉన్నట్లు గమనించారు. అదే విక్రమ్ జాడ అని భావించారు. తన అధ్యయనాన్ని ఆధారాలతో సహా నాసాకు మెయిల్ ద్వారా పంపారు. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకున్న నాసా అక్టోబర్ 14, 15, నవంబర్ 11న ఎల్ఆర్వో ద్వారా మరికొన్ని చిత్రాలు తీసింది. ఈసారి వెలుతురు ఉండడంతో షణ్ముగ గుర్తించిన ప్రదేశంతో పాటు మరో 24చోట్ల మార్పులు ఉన్నట్లు నిర్ధరించుకున్నారు. అలా విక్రమ్ శకలాలు, అది కూలిన ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించగలిగారు.
ఈ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే...
సుబ్రహ్మణియన్ అధ్యయనంపై నాసా ఎల్ఆర్వో ప్రాజెక్టు శాస్త్రవేత్త నోవా పెట్రో స్పందించారు. ‘‘ఈ వ్యక్తి చేసిన అద్భుత అధ్యయనం మాకు ఎంతో ఉపయోగపడింది. అతడికి ఎల్ఆర్వో ప్రాజెక్టుతో గానీ, చంద్రయాన్-2 మిషన్‌తో గానీ ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఈ ప్రయోగంపై ఉన్న ఆసక్తితో మా సమాచారాన్ని వినియోగించుకొని ఉపరితలంపై మేం గుర్తించలేకపోయిన తేడాను గమనించగలిగాడు. దీనికోసం అతను ఎంతో శ్రమించి ఉంటాడు’’ అని నోవా పెట్రో తెలిపారు. అయితే విక్రమ్ శకలాలను తొలుత కనుగొన్న ఘనతను నాసా.. షణ్ముగానికే ఇచ్చింది. ఈ మేరకు అతడికి ఇ-మెయిల్ ద్వారా లేఖ కూడా పంపింది.
సవాల్‌గా స్వీకరించాను...
‘నాసా కూడా విక్రమ్ జాడను కనుక్కోలేకపోవడానికి సవాల్‌గా స్వీకరించాను. మనమెందుకోసారి పయత్నించకూడదు అనుకున్నాను. ఇదే ఆలోచనతో దాని జాడను కనిపెట్టే ప్రయత్నం ప్రారంభించాను. ఇది కష్టంతో కూడుకున్న పని..కానీ, కొంత సమయం కేటాయించి శ్రమించాను. రోజుకి 7 నుంచి 8 గంటలు కేటాయించాను. అలా ఒక ఐదు రోజులు శ్రమించాను. సరైన అవగాహన ఉంటే ఇది ఎవరైనా చేయొచ్చు. నా ప్రయోగం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’ - షణ్ముగ సుబ్రహ్మణియన్
|