‘గుంజన్‌ సక్సేనా’పై సెన్సార్‌ బోర్డుకు ఐఏఎఫ్ లేఖ
close

తాజా వార్తలు

Published : 12/08/2020 23:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గుంజన్‌ సక్సేనా’పై సెన్సార్‌ బోర్డుకు ఐఏఎఫ్ లేఖ

దిల్లీ: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తొలి మహిళా పైలట్ గుంజన్‌ సక్సేనా జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్ గాళ్‌‌’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో గుంజన్‌ సక్సేనా పాత్రలో జాన్వీ కపూర్‌ నటించారు. అయితే ఈ సినిమాపై భారతీయ వాయుసేన (ఐఏఎఫ్‌) పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌కు లేఖ రాసింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో అభ్యంతరకరంగా ఉన్నాయని, ఐఏఎఫ్‌లో మహిళలకు సరైన పని వాతావరణం లేదనే విధంగా చూపించారని లేఖలో పేర్కొంది.

‘‘ధర్మా ప్రొడక్షన్స్‌ సంస్థ ఐఏఎఫ్ ప్రతిష్టకు భంగం కలగకుండా, తర్వాతి తరం ఐఏఎఫ్ అధికారులకు స్ఫూర్తిదాయకంగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు అంగీకరించింది. చిత్ర ట్రైలర్‌ను వీక్షించేందుకు మా కార్యాలయానికి పంపినప్పుడు చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తప్పుదోవ పట్టించేవిగా ఉండటం గమనించాం. సినిమాలో కొన్ని చోట్ల ఐఏఎఫ్‌లో మహిళకు సరైన పని సంస్కృతి లేదనే విధంగా చూపించారు. వాటిలో వాస్తవం లేదు. ఐఏఎఫ్ ఎవరిపట్లా పక్షపాత ధోరణితో వ్యవహరించదు. పురుషులకు, మహిళలకు సమాన అవకాశాలను కల్పిస్తుంది. అయితే సదరు అభ్యంతరకర సన్నివేశాలను తొలగించటం లేదా వాటిలో మార్పులు చేయాలని ధర్మా ప్రొడక్షన్స్‌ సంస్థకు గతంలో సూచించాం. సదరు సంస్థ వాటిలో ఎలాంటి మార్పులూ చేయకుండా సినిమా విడుదల చేసింది. కేవలం ఒక డిస్‌క్లైమర్‌ మాత్రమే అందులో చేర్చారు. ఐఏఎఫ్ గురించి తప్పుగా చూపించి, దానిని సరిదిద్దేందుకు డిస్‌క్లైమర్‌ సరిపోదు’’ అని ఐఏఎఫ్ తన లేఖలో పేర్కొంది. ఈ అంశాలను సెన్సార్‌ బోర్డు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని