ఆగస్టు 15 నాటికల్లా కరోనా వ్యాక్సిన్‌‌? 
close

తాజా వార్తలు

Updated : 03/07/2020 21:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆగస్టు 15 నాటికల్లా కరోనా వ్యాక్సిన్‌‌? 

గడువు నిర్దేశించుకున్న ఐసీఎంఆర్‌!

హైదరాబాద్‌: ‘కరోనా’ వైరస్‌కి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాను అందుబాటులోకి తెచ్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మనుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే.. ఆగస్ట్‌ 15 నాటికి మార్కెట్లోకి విడుదల చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)  భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ రాసిన ఓ లేఖ తాజాగా వెలుగులోకి తెచ్చింది. ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో క్లినికల్‌ ట్రయల్స్‌ వేగవంతంగా జరిపేందుకు డీసీజీఐ అనుమతి సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, లక్ష్యాన్ని చేరుకోవడంలో క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఎంపిక చేసిన 12 సంస్థల సహకారం అత్యంత కీలకమని బలరాం భార్గవ లేఖలో పేర్కొన్నారు. జులై తొలి వారంలోనే మనుషులపై ప్రయోగాలు ప్రారంభించేందుకు కావల్సిన అనుమతులన్నింటినీ వీలైనంత వేగంగా పొందాలని కోరారు. ‌ఈ మేరకు ఎంపిక చేసిన సంస్థలకు రాసిన లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది.   

దీనిపై స్పందించిన ఐసీఎంఆర్‌లోని విశ్వసనీయ వర్గాలు లేఖను ధ్రువీకరించాయి. అయితే, అది కేవలం అంతర్గత సమాచారం కోసం మాత్రమే రాసిందని తెలిపాయి. భారత్‌ బయోటెక్‌ మాత్రం స్పందించడానికి నిరాకరించింది. దీంతో వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకురావడానికి తాజాగా పెట్టుకున్న గడువు ఇంకా కేవలం నెలన్నర రోజులే ఉండడం గమనార్హం. ఒకవేళ మనుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే.. ప్రపంచంలో కొవిడ్‌పై సమర్థవంతంగా పనిచేసే తొలి వ్యాక్సిన్‌గా ‘కొవాగ్జిన్‌’ నిలవనుంది. 

‘కొవాగ్జిన్‌’ టీకా మొదటి- రెండో దశ క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) ఇటీవలే అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ టీకాను ఐసీఎంఆర్‌, పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా సార్స్‌- కోవ్‌- 2 వైరస్‌ స్ట్రెయిన్‌ను ఎన్‌ఐవీ.. భారత్‌ బయోటెక్‌కు బదిలీ చేసింది తదనంతరం హైదరాబాద్‌ సమీపంలోని భారత్‌ బయోటెక్‌కు చెందిన బయో సేఫ్టీ లెవల్‌ - 3 ప్రయోగశాలలో టీకాను తయారు చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని