మధ్యప్రదేశ్‌లో ఆధిక్యంలో భాజపా
close

తాజా వార్తలు

Published : 10/11/2020 10:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మధ్యప్రదేశ్‌లో ఆధిక్యంలో భాజపా

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి గంటల్లో వెలువడిన ఫలితాల ప్రకారం భాజపా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉదయం 9:55 గంటల సమయంలో భాజపా 18 స్థానాలు, కాంగ్రెస్‌ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.  సన్వేర్‌ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న భాజపా అభ్యర్థి తులసి సిల్వత్‌ 2400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు ఫలితాల సరళి నేపథ్యంలో రాష్ట్ర పీసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. 

ఏడు నెలల క్రితం.. కమల్‌నాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి.. భాజపా గూటికి సింధియా వర్గం చేరిన విషయం తెలిసిందే. దాని ఫలితంగా ఖాళీ అయిన 25 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మృతితో మరో 3 నియోజకవర్గాలు ఈ జాబితాలో చేరాయి. 230 సీట్లున్న మధ్యప్రదేశ్‌ శాసనసభలో ప్రస్తుతం భాజపాకు 107, కాంగ్రెస్‌కు 87మంది ఎమ్మెల్యేలున్నారు. సాధారణ ఆధిక్యాన్ని చేరుకోవాలంటే ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని భాజపాకు మరో 8 సీట్లు దక్కితే చాలు. 28 స్థానాల్లో ఎక్కువచోట్ల కాంగ్రెస్‌ నెగ్గితే అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకునే అవకాశముంటుంది. వీటిలో 27 చోట్ల ఇదివరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు.

మరోవైపు గుజరాత్‌, యూపీ సహా వివిధ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలకు, బిహార్‌లో వాల్మీకినగర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపూ కొనసాగుతోంది. 

* గుజరాత్‌లో ఎనిమిది స్థానాలకు గానూ భాజపా ఏడు స్థానాల్లో, కాంగ్రెస్‌ ఒకచోట ఆధిక్యంలో కొనసాగుతోంది.

* ఒడిశాలో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. బీజేడీ, ఇతరులు చెరో స్థానంలో ముందంజలో ఉన్నారు.

* మణిపూర్‌లో ఐదు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా ఒకచోట భాజపా ఆధిక్యంలో ఉంది. 

* ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఐదు స్థానాల్లో భాజపా, రెండు స్థానాల్లో ఎస్పీ ముందంజలో ఉన్నాయి. 

* ఛత్తీస్‌గఢ్‌లో ఒకస్థానానికి ఉపఎన్నిక జరగ్గా కాంగ్రెస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది.

* కర్ణాటకలో ఉపఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లో భాజపా ముందంజలో ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని