close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 10/02/2020 14:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఊడ్చేసిన చోటే ఉలిక్కిపడరుగా..?

పరువు నిలబెట్టుకోవాలన్న తాపత్రయంలో టీమ్‌ఇండియా

విజయ దుందుభి మోగించాలన్న పట్టుదలతో కివీస్‌

సన్నివేశంలో ఒక్కసారిగా ఎంత మార్పో! వారం రోజుల ముందు న్యూజిలాండ్‌ను టీ20 సిరీస్‌లో 5-0తో ఊడ్చేసింది భారత్‌. ఇప్పుడు వన్డే సిరీస్‌లో 0-3తో క్లీన్‌స్వీప్‌ ప్రమాదంలో పడిపోయింది. విచిత్రం ఏంటంటే..? ఆతిథ్య జట్టును టీమ్‌ఇండియా ఎక్కడైతే క్లీన్‌స్వీప్‌ చేసిందో కథ మళ్లీ అక్కడికే చేరుకుంది. కాకపోతే ఈ సారి కిస్మత్‌ వాళ్ల వైపుంది. మరి పరుగుల వరద పారే మౌంట్‌ మాంగనూయ్‌లో మంగళవారం కోహ్లీసేన నిలిచేనా!!!


హఠాత్తుగా ఆత్మరక్షణ

వారం రోజుల్లో పరిస్థితి అటుఇటైంది. వరుస విజయాలతో జైత్రయాత్ర సాగించిన కోహ్లీసేన హఠాత్తుగా ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది. తిరుగులేదనుకున్న జట్టు బౌలింగ్‌, ఫీల్డింగ్‌ తప్పిదాలతో వన్డే సిరీస్‌లో 0-2తో వెనకబడి నిరాశపరిచింది. ఆఖరి వన్డేలోనైనా గెలిచి క్లీన్‌స్వీప్‌ తప్పించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సిరీస్‌లో రోహిత్‌శర్మ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాది కాలంగా అతడెంత ఫామ్‌లో ఉన్నాడో అందరికీ తెలిసిందే. 12 నెలలుగా 57.30గా ఉన్న సగటే అందుకు నిదర్శనం. ధావన్‌ లేడు. కీపింగ్‌ చేస్తున్న కేఎల్‌ రాహుల్‌ ఐదో స్థానానికి వెళ్లాడు. కొత్త ఓపెనర్లు పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌ శుభారంభం అందిస్తున్నా వ్యక్తిగత మెరుపుల్లేవు. పరుగుల భారమంతా సారథి కోహ్లీపైనే పడింది. కివీస్‌ బౌలర్లు అతడు ఎక్కువ పరుగులు చేయకుండా విజయవంతంగా అడ్డుకోవడంతో అర్థంకాని పరిస్థితి నెలకొంది.


బౌలింగ్‌ మెరుగవ్వాలి

వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియా బౌలింగ్‌, ఫీల్డింగ్‌ పేలవంగా ఉన్నాయి. తీరికలేని షెడ్యూలుతో సాధనకు సమయం దొరకడం లేదని చెబుతున్నా క్యాచులు నేలపాలు చేయకుండా ఉంటేనే కదా మ్యాచులు గెలిచేది. జస్ప్రీత్‌ బుమ్రా త్వరగా లయ అందుకోవాలి.  గాయపడ్డ తర్వాత అతడి బౌలింగ్‌లో మునుపటి పటిమ కనిపించడం లేదు. అతడి బంతుల్ని కివీస్‌ ఆటగాళ్లు సులభంగా ఆడేస్తున్నారు. బంతి, బ్యాటుతో ఆకట్టుకున్న నవదీప్‌ సైనికి తిరుగులేదు. కుల్‌దీప్‌ బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో నిరాశపరుస్తున్నాడు. చివరి మ్యాచులో అతడికి చోటు కష్టమే. భీకరంగా విజృంభిస్తున్న రాస్‌టేలర్‌ను అడ్డుకోవడంపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయనడంలో సందేహం లేదు. చాన్నాళ్లు టీమ్‌ఇండియా బౌలర్లు తొలి పది ఓవర్లలో ఎక్కువ వికెట్లు తీయడం లేదు. గత రెండు మ్యాచులే ఇందుకు ఉదాహరణ.


పంత్‌కు అవకాశం!

 సోమవారం నాటి ఐచ్ఛిక సాధనలో రాహుల్‌, పృథ్వీషా, అయ్యర్‌, జాదవ్‌, చాహల్‌ పాల్గొనలేదు. కోహ్లీ అందరికన్నా ముందుగా నెట్స్‌లోకి దూరిపోయాడు. బ్యాటింగ్‌ చేశాడు. రిషభ్‌ పంత్‌ సైతం ఎక్కువ సేపు సాధన చేశాడు. మహ్మద్ షమి మినహా పేసర్లంతా శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. అంటే బౌలింగ్‌ కూర్పులో మార్పులు ఉండకపోవచ్చు. షా బదులు రాహుల్‌తో ఓపెనింగ్‌ చేయించి పంత్‌ను జట్టులోకి తీసుకోవచ్చు. అద్భుతంగా ఆడుతున్న శ్రేయస్‌.. కివీస్‌ సీనియర్‌ రాస్‌టేలర్‌లా ఆఖరివరకు ఉండాలి. మ్యాచ్‌లు ముగించాలి. చివరి మ్యాచులో లోయర్‌ ఆర్డర్‌ రాణించడం సానుకూలాంశం. జడ్డూ, సైని పోరాటం ఆకట్టుకుంది.


ఆత్మవిశ్వాసంతో కివీస్‌

న్యూజిలాండ్‌ ఉత్సాహంగా కనిపిస్తోంది. ఆ జట్టులో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. కెప్టెన్‌ విలియమ్సన్‌ రావడంతో ఆ జట్టు బలం మరింత పెరిగింది. ఓపెనర్లు గప్తిల్‌, నికోల్స్‌ శుభారంభాలు ఇస్తున్నారు. టిమ్‌ సౌథీ, మిచెల్‌ శాంట్నర్‌ కడుపునొప్పితో బాధపడుతున్నారు. స్కాట్‌ కుగులీన్‌కు వైరల్‌ జ్వరం. మ్యాచ్‌లోపు వీరు కోలుకోవాలని కివీస్‌ భావిస్తోంది. ముందు జాగ్రత్తగా స్పిన్నర్‌ ఇష్ సోధి, పేసర్‌ బ్లెయిర్‌ టిక్నెర్‌ను పిలిపించింది. టామ్‌ లేథమ్‌, జిమ్మీ నీషమ్‌ ఫామ్‌లో ఉన్నారు. అంతా బాగుంటే ఆతిథ్య జట్టులో ఒక్క మార్పుకు మించి ఉండకపోవచ్చు.


పరుగుల వరద

మౌంట్‌ మాంగనూయ్‌లో పరుగుల వరద ఖాయమే. పిచ్‌ స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలిస్తుంది. చివరి ఐదు వన్డేల్లో వారు 80 వికెట్లు తీశారు. సగటు 40.28, ఎకానమీ 5.31 అని గణాంకాలు చెబుతున్నాయి. చివరి ఐదు వన్డేల్లో తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 296గా ఉంది. 2019లో టీమ్‌ఇండియా ఇక్కడ ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలవడం ఊరటనిచ్చే అంశం. ఇప్పటివరకు ఇక్కడ పది వన్డేలు జరగ్గా తొలుత బ్యాటింగ్‌ చేసినవి, ఛేదించినవి చెరో ఐదు గెలిచాయి. మైదానంలోని డైమెన్షన్స్‌ను అర్థం చేసుకొని పరుగులు, ఫీల్డింగ్‌ చేస్తే గెలుపు దక్కుతుంది.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.