close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 14/03/2020 14:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అలాగైతే.. ఐపీఎల్‌ 2020 రద్దే!

ఏప్రిల్‌ 20 తుది గడువు అంటున్న ఐపీఎల్‌ అధికారి

విదేశీయులు లేకుండా టోర్నీ వద్దే వద్దంటున్న ఫ్రాంచైజీలు!

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020పై కారుమబ్బులు వేగంగా కమ్ముకుంటున్నాయి. కరోనా వైరస్‌ ముప్పుతో మార్చి 29న ఆరంభమవ్వాల్సిన టోర్నీని ఏప్రిల్‌ 15కు వాయిదా వేశారు. పరిస్థితులు అనుకూలించక ఏప్రిల్‌ 20న గనక సీజన్‌ మొదలవ్వకపోతే ఈ ఏడాది ఐపీఎల్‌ వేడుక లేనట్టేనని తాజా సమాచారం!

ఐపీఎల్‌ 13వ ఎడిషన్‌పై బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి, ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు, అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. దౌత్య, ఉద్యోగ మినహా అన్ని విభాగాల వీసాలను ఏప్రిల్‌ 15 వరకు రద్దు చేసింది. విదేశీ ఆటగాళ్లంతా వాణిజ్య వీసాల విభాగంలో రావడంతో వారికి అప్పటి వరకు ప్రవేశం లేదు. కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రజలు ఒకే చోట గుమిగూడకుండా చూడాలని బీసీసీఐ సహా క్రీడా సమాఖ్యలకు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను వాయిదా వేశారు. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచులదీ ఇదే పరిస్థితి.

కరోనా విస్తృతి ఏప్రిల్‌లో ఎలా ఉంటుందో తెలియని నేపథ్యంలో ఐపీఎల్‌ రద్దు దిశగా సాగే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘పరిస్థితులు అనుకూలిస్తే ఏప్రిల్‌ 20న ఐపీఎల్‌ ఆరంభమవుతుంది. ఐతే ఆ నిర్ణయం ఏప్రిల్‌ 10నే తీసుకోవాలి. ఏప్రిల్‌ 20 లోపు టోర్నీ మొదలవ్వకపోతే వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టే’ అని ఐపీఎల్‌ అధికారి ఒకరు తెలిపారు. ‘ఏప్రిల్‌ 21 నుంచి మే 31 వరకు ఆరు వారాల సమయం ఉంది. ఎక్కువ రోజులు రెండు మ్యాచులు నిర్వహిస్తే 60 మ్యాచులకు ఆ సమయం సరిపోతుంది. ఏప్రిల్‌ మొదటి వారానికి కరోనా వైరస్‌ కట్టడిపైనే ఇదంతా ఆధారపడి ఉంటుంది’ అని ఆ అధికారి స్పష్టం చేశారు.

ఒకవేళ మొదలు పెట్టాలనుకున్నా ఫ్రాంచైజీలు ఖాళీ స్టేడియాల్లో ఆటకైనా అంగీకరిస్తున్నాయేమో కానీ విదేశీ ఆటగాళ్లు లేకుండా మాత్రం అస్సలు వద్దంటున్నాయని సమాచారం. ఎందుకంటే ఎక్కువ ఫ్రాంచైజీలు విదేశీ స్టార్లపైనే ఆధారపడుతున్నాయి. కోచింగ్‌, సాంకేతిక సిబ్బందిలోనూ వారే ఉన్నారు. అందుకే విదేశీయులు లేకుంటే ఐపీఎల్‌ కష్టం. వైరస్‌ వ్యాప్తి తగ్గకపోతే వీసాలపై ఆంక్షలు పొడగిస్తారే కానీ సడలించరన్నది తెలిసిందే.

చదవండి: ఐపీఎల్‌ రద్దు/వాయిదాతో ఒక్కో ఫ్రాంచైజీకి ఎంత నష్టమంటే?


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.