
తాజా వార్తలు
గవర్నర్‌తో భేటీపై స్పందించిన గంగూలీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా..బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. గంగూలీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని గతకొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గంగూలీ గవర్నర్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. గవర్నర్‌తో భేటిపై వస్తున్న ఊహాగానాలపై దాదా స్పందించారు. ‘గవర్నర్ ఈడెన్ గార్డెన్స్‌ను సందర్శించాలని అనుకున్నారు.. కానీ అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతున్నందున అది సాధ్యం కాదని చెప్పాను. వచ్చేవారం స్టేడియాన్ని సందర్శించడానికి రావాలని గవర్నర్‌ను కోరగా.. ఆయన అంగీకరించారు. ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశం మాత్రమే’ అని గంగూలీ స్పష్టం చేశారు. కాగా.. ఆదివారం రాజ్‌భవన్‌కు వెళ్లిన దాదా గంటా 20 నిమిషాల పాటు గవర్నర్ జగదీప్ ధన్కర్తో సమావేశమయ్యారు. ఈ భేటీపై వచ్చిన ఊహాగానాలకు అటు గవర్నర్ జగ్దీప్ ధన్కర్ కూడా ఓ ట్వీట్‌తో తెరదించారు. పలు సమస్యలపై గంగూలీతో చర్చించానని తెలిపారు. అలాగే పురాతన ఈడెన్ గార్డెన్స్‌ను సందర్శించాలని గంగూలీ కోరారని, అందుకు అంగీరించానని గవర్నర్ పేర్కొన్నారు.