close
Array ( ) 1

తాజా వార్తలు

వన్డే సిరీస్‌ పోయె! భారత్‌కు రెండో ఓటమి

2-0తో సిరీస్‌ కైవసం చేసుకున్న న్యూజిలాండ్‌

ఛేదనలో జడేజా, శ్రేయస్‌, సైని పోరాటం

టీమ్‌ఇండియాకు భంగపాటు. టీ20 సిరీస్‌ను 5-0తో ఊడ్చేసిన కోహ్లీసేన వరుసగా రెండో వన్డేలో ఓడటం ఊహించని పరాభవం. న్యూజిలాండ్‌ చేసింది 273/8. లక్ష్యం ఛేదించలేనంత పెద్దదేమీ కాదు. పిచ్‌ మందకొడిగా ఉన్నా మైదానం చిన్నదే. అందుకే చక్కని భాగస్వామ్యాలు రెండున్నా గెలుపు సులువే! అలాంటిది రెండో వన్డేలో 22 పరుగుల తేడాతో ఓడింది టీమ్‌ ఇండియా. ఒత్తిడనే పరీక్షలో మరోసారి విఫలమై కొత్త సందేహాలకు తెరతీసింది.


టాప్‌ ఆర్డర్‌ వైఫల్యం

21, 13, 23, 14, 25, 33, 24, 76, 22, 0.. టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ స్కోర్లు కావివి. నెలకొల్పిన భాగస్వామ్యాలు. అందులో చివరి ఐదు రవీంద్ర జడేజా (55; 73 బంతుల్లో 2×4, 1×6) చేసినవే. ఆపై మిగతా నాలుగు శ్రేయస్‌ అయ్యర్‌ (52; 57 బంతుల్లో 7×4, 1×6)వి. వీటిని బట్టి 274 పరుగుల లక్ష్య ఛేదనలో టాప్‌ ఆర్డర్‌ ఎలా ఆడిందో ఊహించుకోవచ్చు. మయాంక్‌ (3) త్వరగా ఔటైనా పృథ్వీషా (24; 19 బంతుల్లో 6×4) చక్కని బౌండరీలతో అలరించడంతో ఫర్వాలేదులే అనుకున్నారు. కానీ కివీస్‌ పేసర్లు బెనెట్‌, టిమ్‌ సౌథీ, జేమిసన్‌, గ్రాండ్‌హోమ్‌ తలో రెండు వికెట్లతో సమష్టిగా చెలరేగడంతో భారత్‌ చిక్కుల్లో పడింది. సగటున 20 పరుగుల వ్యవధిలో పృథ్వీషా, విరాట్‌ కోహ్లీ (15; 25 బంతుల్లో 1×4), లోకేశ్‌ రాహుల్‌ (4; 8 బంతుల్లో), కేదార్‌ జాదవ్‌ (9; 27 బంతుల్లో 1×4) ఔటవ్వడంతో 96/5తో భారత్‌ కష్టాల్లో పడింది.


జడ్డూ-సైని పోరాటం

ఒకవైపు వికెట్లు పడుతున్నా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ (52) అద్భుతంగా పోరాడాడు. చక్కని షాట్లతో ఆకట్టుకున్నాడు. అతడికి మరో బ్యాట్స్‌మన్‌ తోడుగా ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఐతే అర్ధశతకం తర్వాత బెనెట్‌ షార్ట్‌పిచ్‌లో వేసిన బంతి తలమీదుగా వెళ్తోంటే అడ్డంగా షాట్‌ ఆడి కీపర్‌ లేథమ్‌కు దొరికిపోయాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా 2019 ప్రపంచకప్‌ సెమీస్‌ తరహాలో పోరాటం చేశాడు. నవదీప్‌ సైని (45; 49 బంతుల్లో 5×4, 2×6) రూపంలో అతడికో చక్కని భాగస్వామి దొరికాడు. హ్యాట్రిక్‌ బౌండరీలు, కళ్లు చెదిరే సిక్సర్లతో ఈ యువ పేసర్‌ అందరినీ ఆశ్చర్యపరిచాడు. మ్యాచ్‌ మలుపు తిరుగుతుందని అభిమానులు అనుకొనేలా చేశాడు. జేమిసన్‌ వేసిన 44.2వ బంతిని సిక్సర్‌గా మలిచాడు. మూడో బంతిని వికెట్లు వదిలేసి ఆడగా అతడి నుంచి తప్పించుకున్న బంతి వికెట్లను తాకేసింది. దాంతో ఎనిమిదో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివర్లో యుజువేంద్ర చాహల్‌ (10; 12 బంతుల్లో 1×4) కలిసి జడ్డూ పోరాడాడు. అర్ధశతకం సాధించాడు. చాహల్‌తో వికెట్ల మధ్య పరుగులు పెట్టించాడు. 251 వద్ద యూజీ రనౌట్‌ కావడంతో జడ్డూకు షాట్లు ఆడక తప్పని పరిస్థితి. నీషమ్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాదబోయి గ్రాండ్‌హోమ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దాంతో భారత్‌ కథ ముగిసింది.


మళ్లీ.. రాస్‌ టేలరే

తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌కు మార్టిన్‌ గప్తిల్‌ (79; 79 బంతుల్లో 8×4, 3×6), హెన్రీ నికోల్స్ (41; 59 బంతుల్లో 5×4) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నికోల్స్‌ను చాహల్‌ ఎల్బీ చేయగా గప్తిల్‌ రనౌట్‌ అయ్యాడు. టామ్‌ బ్లండెల్‌ (22; 25 బంతుల్లో 3×4) ఫర్వాలేదనిపించాడు. వీరు ఔటైన తర్వాత కివీస్‌ పరుగుల వేగం మందగించింది. టామ్‌ లేథమ్‌ (7), జేమ్స్‌ నీషమ్‌ (3), గ్రాండ్‌హోమ్‌ (5), మార్క్‌ చాప్‌మన్‌ (1), టిమ్‌ సౌథీ (3) విఫలమయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా రాస్‌ టేలర్‌ (73; 74 బంతుల్లో 6×4, 2×6) అజేయంగా పోరాడాడు. కైల్‌ జేమిసన్‌ (25*; 24 బంతుల్లో 1×4, 2×6)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 76 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించాడు. చాహల్‌ 3, శార్దూల్‌ 2 వికెట్లు పడగొట్టారు. జడ్డూకు 1 వికెట్‌ దక్కింది. నవదీప్‌ సైని పరుగులను నియంత్రించాడు. బుమ్రాకు వరుసగా మూడో మ్యాచులోనూ వికెట్లు దక్కకపోవడం గమనార్హం. 2014 తర్వాత న్యూజిలాండ్‌కు భారత్‌పై ఇదే తొలి సిరీస్‌ విజయం.

- ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.