
తాజా వార్తలు
5 శాతానికి యాక్టివ్ కేసులు
కొత్తగా 38,617 కేసులు..474 మరణాలు
దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం కొత్తగా 38,617 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 89,12,907కు చేరింది. సోమవారం 30వేలకు దిగువన కొత్త కేసులు నమోదు కావడం కాస్త ఊరట కలిగించినా.. గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల్లో 32 శాతం పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో 474 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 1,30,993కు పెరిగింది. గత కొద్ది రోజులుగా క్రియాశీల కేసులు (యాక్టివ్) ఐదు లక్షలకు దిగువనే ఉంటున్నాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 4,46,805గా ఉండగా.. యాక్టివ్ కేసుల రేటు 5.01 శాతానికి తగ్గింది. ఇప్పటి వరకు 83,35,109 (93.52 శాతం) మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. నవంబర్ 17న 9,37,279 మందికి కొవిడ్ నిర్ధరాణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 12,74,80,186 పరీక్షలు చేశారు.
మరోవైపు దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నవంబర్ ఒకటి నుంచి ఇప్పటివరకు లక్షకు పైగా కొత్త కేసులు నమోదుకావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం అక్కడ 4,95,598 మంది వైరస్ బారినపడగా.. 7,812మంది మహమ్మారికి బలయ్యారు.