
తాజా వార్తలు
రికవరీ రేటు 93.66 శాతం
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరసగా రెండో రోజు 40వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ నుంచి కోలుకున్నవారి కంటే.. కొత్త కేసుల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. అయితే, కొద్ది వారాలుగా క్రియాశీల కేసుల సంఖ్య ఐదు లక్షల దిగువనే ఉండటం కాస్త ఊరటనిస్తోంది.
తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..బుధవారం ఒక్కరోజే 44,489 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 92,66,705కి చేరింది. ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి 86,79,138 మంది కోలుకోగా.. ఆ రేటు 93.66శాతంగా ఉంది. కాగా, దేశంలో ప్రస్తుతం 4,52,344(4.88శాతం) క్రియాశీల కేసులున్నాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే క్రియాశీల రేటులో పెరుగుదల కనిపించింది. మరోవైపు, ఈ మహమ్మారి కారణంగా నిన్న ఒక్కరోజే 524 మరణాలు సంభవించగా.. మొత్తం మీద 1,35,223 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గడిచిన 24 గంటల్లో 10,90,238 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
దిల్లీలో తగ్గిన వైరస్ పాజిటివిటీ రేటు..
బుధవారం దేశ రాజధాని దిల్లీలో 5,246 కొత్త కేసులు నమోదు కాగా, వైరస్ పాజిటివిటీ రేటు 8.49 శాతం తగ్గింది. 99 మరణాలు సంభవించాయి. ఐదు రోజుల తరవాత రోజూవారీ మరణాల సంఖ్య 100కు దిగువకు చేరడం సానుకూల పరిణామం. వైరస్ కట్టడికి మాస్కుల ప్రాముఖ్యతను దృష్టిలోపెట్టుకొని ఉత్తర దిల్లీ మేయర్ జైప్రకాశ్ బుధవారం సాదర్ బజార్లో ‘మాస్క్ బ్యాంక్’ను ప్రారంభించారు. అవసరం ఉన్నవారు ఉచితంగా బ్యాంక్ నుంచి మాస్కులను పొందవచ్చని ఆయన తెలిపారు.