
తాజా వార్తలు
స్పుత్నిక్ టీకా: భారత్‌లో 30కోట్ల డోసుల తయారీ!
వెల్లడించిన ఆర్డీఐఎఫ్
మాస్కో: కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి ను భారత్‌లో భారీ ఎత్తున ఉత్పత్తి చేసేందుకు రష్యా ప్రణాళికలు సిద్ధం చేసింది. కేవలం 2021 సంవత్సరంలోనే దాదాపు 30కోట్ల డోసులను తయారు చేయనున్నట్లు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) వెల్లడించింది. ఇప్పటికే భారత్‌లో ఉత్పత్తి చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ తొలి శాంపిళ్లను రష్యా పరీక్షిస్తున్నట్లు ఆర్డీఐఎఫ్ సీఈఓ కిరిల్ దిమిత్రీవ్ పేర్కొన్నారు.
‘భారత్‌లో భారీ స్థాయిలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ డోసులను తయారుచేసేందుకు నాలుగు తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాము. వచ్చే ఏడాదిలో 30కోట్ల డోసులు లేదా అంతకంటే ఎక్కువే ఉత్పత్తి చేయనున్నాం’ అని ఆర్డీఐఎఫ్ సీఈఓ పేర్కొన్న విషయాన్ని భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం వెల్లడించింది. వీటి ఉత్పత్తి కూడా 2021 మొదట్ల్లోనే ప్రారంభం కానుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 110 వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి.. తమకు అనుగుణమైన 10 కేంద్రాలను దీని తయారీకి ఎంచుకున్నట్లు ఆర్డీఏఎఫ్ వెల్లడించింది. మానవ అడినోవైరస్ ఆధారంగా తయారుచేసిన ఈ వ్యాక్సిన్ ఎంతో సురక్షితమని.. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తామని ఆర్డీఐఎఫ్ సీఈఓ వెల్లడించారు. ఇక స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీని భారత్‌తో పాటు దక్షిణ కొరియా, బ్రెజిల్, చైనాలోనూ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు.
95శాతం సమర్థత..
ఆర్డీఐఎఫ్ సహకారంతో గమలేయా ఇన్స్టిట్యూట్ తయారుచేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ 95శాతం సమర్థత కలిగివున్నట్లు ఈ మధ్యే వెల్లడించింది. అంతేకాకుండా కొందరిలో ఇది 96 నుంచి 97శాతం సమర్థత చూపించినట్లు అధ్యక్షుడు పుతిన్ చెప్పనట్లు విదేశీ వ్యవహారాల శాఖ ట్విటర్లో పేర్కొంది. ఇప్పటికే దీన్ని దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ఇప్పటివరకు దాదాపు 2లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. అయితే, అక్కడ ఉచితంగానే పంపిణీ చేస్తున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర 10డాలర్లుగా నిర్ణయించినట్లు సమాచారం. ఇక సాధ్యమైతే తాను కూడా వ్యాక్సిన్ తీసుకుంటానని అధ్యక్షుడు పుతిన్ ఈ మధ్యే వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి..
రష్యాలో.. కొవిడ్ వ్యాక్సిన్‌కు మిశ్రమ స్పందనే..!
కొవిడ్19: మిస్టరీ మూలాలపై దర్యాప్తు