
తాజా వార్తలు
టీకా ఆలస్యమైతే.. 7.5శాతం పతనం
ముంబయి: కొవిడ్ వ్యాక్సిన్ ఆవిష్కరణలో జాప్యం జరిగే కొద్దీ భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది. అన్నీ అనుకున్నట్లు సాగితే భారత్ జీడీపీ వృద్ధిరేటు -4గా రావచ్చని పేర్కొంది. అదే సమయంలో టీకా ఆలస్యమైతే మాత్రం జీడీపీ వృద్ధిరేటు -7.5శాతంగా ఉండొచ్చని లెక్కగట్టింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ విభాగంలోని ఆర్థికశాస్త్రవేత్తలు ఈ మేరకు అంచనాల్లో సర్దుబాట్లు చేశారు.
ఇప్పటికే కొవిడ్‌కు టీకాను కనుగొనేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నా.. అవి ఎప్పటిలోగా మార్కెట్లోకి వస్తాయో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. జాతీయ స్థాయి లాక్డౌన్లు, కఠిన నిబంధనల కారణంగా జీడీపీ వృద్ధిరేటుపై ప్రతికూల ప్రభావం పడిందంటున్నారు. ‘‘ప్రపంచ టీకా కోసం మరో సంవత్సరం ఎదురు చూడాల్సి వస్తే మాత్రం భారత జీడీపీ -7.5శాతం పతనం అవ్వవచ్చు. మరీ ప్రతికూల వాతావరణంలో మాత్రమే ఇలా జరగొచ్చు’’ అని వారు తెలిపారు. ప్రతి నెల లాక్డౌన్ జీడీపీలో ప్రభావితం చేస్తుంది. దీనిని ఎదుర్కొవడానికి ఆర్బీఐ మరో 2శాతం వరకు వడ్డీరేట్లలో కోత విధించవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా నిపుణులు చెప్పారు.
అక్టోబర్ వరకు ఆగాల్సిందే..
తొలుత లాక్డౌన్ నిబంధనలు ఆగస్టు మధ్య నాటికి ఎత్తేస్తారని భావించారని.. కానీ, అన్‌లాక్ మొదలయ్యాక కేసులు పెరగడంతో సెప్టెంబర్ నాటికి పరిస్థితి చక్కదిద్దుకోవచ్చని బీవోఎఫ్‌ఏ నిపుణల బృందం భావించింది. కానీ, ఇప్పుడు మాత్రం అక్టోబర్ మధ్య వారం వరకు సమయం పట్టవచ్చని చెబుతోంది. ఈ ప్రభావం వచ్చే ఏడాది జీడీపీపై 1శాతం వరకు పడుతుందని పేర్కొంది.