close

తాజా వార్తలు

హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!

సత్వర న్యాయం జరిగిందంటున్న ప్రముఖులు

 

న్యాయం జరిగింది.. మనషులకు హక్కులుంటాయి మృగాళ్లకు కాదు.. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి అదీ పోలీసోడై ఉండాలి.. నిద్రలేవగానే మంచి వార్త తెలిసింది.. ఇకమీదట ఘోరాలు జరగకుండా రక్షించుకోవాలి.. రాముడు, కృష్ణుడిని పూజించడం కాదు అవసరమైతే ఆ అవతారమెత్తాలి.. ఇవీ దిశను పాశవికంగా అత్యాచారం చేసి కాల్చేసిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన తర్వాత ప్రజలు, సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు చేస్తున్న వ్యాఖ్యలు. ఎన్‌కౌంటర్‌ చేసిన తీరుపై చర్చలెన్ని జరుగుతున్నా అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట ‘దిశకు న్యాయం జరిగింది’.


సత్వర న్యాయం కోసం

సాధారణంగా ప్రజల సమస్యలపై సినీ, క్రీడా ప్రముఖులు అంతగా మాట్లాడరు. ఆచితూచి స్పందిస్తారు. దిశ హత్యాచార నిందితుల కాల్చివేత విషయంలో మాత్రం ప్రజలు, సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ ప్రముఖులందరూ ఒక్కతాటిపైకి వచ్చారు. ‘తగిన శాస్తి’ జరిగిందనే అంటున్నారు. ఎందుకిలా..? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం ఘటనలో నేరస్థులకు ఇంకా శిక్ష పడనేలేదు. వారిని త్వరగా ఉరితీయాలని నిర్భయ తల్లి, స్త్రీవాదులు ప్రతిరోజూ డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. ‘న్యాయం’ నానాటికీ ఆలస్యం అవుతుండటంతో అందరిలోనూ ఒకరకమైన అసహనం ప్రజ్వరిల్లుతోంది. ‘దిశ’ విషయంలోనూ నిర్భయ తల్లి చెప్పిందీ అదే. కనీసం ఆమెకైనా సత్వర న్యాయం జరగాలని. ఆ డిమాండ్‌ చేసిన వారం రోజుల్లోనే మృగాళ్ల ఎన్‌కౌంటర్‌ జరగడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ‘నా కూతురికి ఏడేళ్లైనా న్యాయం జరగలేదు. దిశకు ఏడు రోజుల్లోనే సాధ్యమైంది’ అని ఆమె చెబుతున్నారు. సత్వర న్యాయం జరిగిందని దిశ తల్లిదండ్రులు, సోదరి సైతం పోలీసులు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.


దుష్ట సంహారం అవసరం

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్‌ సత్యార్థి అభిప్రాయమూ ఆసక్తి రేపుతోంది. ‘త్రేత, ద్వాపర యుగాల్లో మహిళలను అపహరిస్తే రాముడు, కృష్ణుడు రక్షించారు. భారత పుత్రికలను అపహరించి, హత్యాచారం చేస్తున్న ఈ కాలంలో రాముడు, కృష్ణుడి పూజలు చేస్తూ కూర్చోవడమా?రామ, కృష్ణుల్లా మారాలి గానీ’ అని అంటున్నారు. దుష్ట సంహారం ఎలాగైనా జరగాల్సిందే అన్నది ఆయన మాటల్లో కనిపిస్తున్న భావం. ‘దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కఠిన శిక్షలు సరైనవే. నిర్భయకూ న్యాయం జరగాలి...’ - బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యలివి. ‘ఎన్‌కౌంటర్‌తో మహిళల్లో భయం కాస్త తగ్గింది. రక్షణ పెరిగిన అనుభూతి కలుగుతోంది. ఏదేమైనా దిశ తల్లిదండ్రుల బాధను తీర్చలేం’ అని కేంద్ర మాజీమంత్రి ఉమా భారతి అంటున్నారు. ‘ఏ పరిస్థితుల్లో చేశారో తెలీదుగానీ ఇక్కడ పోలీసే ఉత్తమ న్యాయమూర్తి’ అని జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మ అన్నారు. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, కపిల్‌ మిశ్రా, భూపేశ్‌ భగేల్‌, తృప్తిదేశాయ్‌, బాబా రాందేవ్‌, మీనాక్షి లేఖి, రబ్రీదేవి, నారాయణ (సీపీఐ), మేకతోటి సుచరిత తదితరులు పోలీసుల చర్యను స్వాగతించారు.


ఆత్మకు శాంతి చేకూరాలి

సినీ నటులు సైతం దిశకు న్యాయం జరిగిందంటున్నారు. ‘న్యాయం జరిగింది. ఇక దిశ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. రాఖీ, టెంపర్‌ వంటి చిత్రాల్లో  హత్యాచార బాధితుల తరఫున పోరాడిన ఆయనకు దిశ కుటుంబ సభ్యల బాధేంటో తెలుసు. అల్లు అర్జున్‌దీ అదే అభిప్రాయం. ‘ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి. వాడు పోలీసోడై ఉండాలి’ అని నాని ట్వీట్‌ చేశారు. ‘దేవుడే పోలీసుల రూపంలో నిందితులను శిక్షించాడు’ అని బాలకృష్ణ అన్నారు. ‘పోలీసుల నుంచి ఎవరూ తప్పించుకోలేరు’ అన్నది బోయపాటి మాట. ‘నిద్రలేవగానే శుభవార్త విన్నాను’ అని మంచు విష్ణు, అక్కినేని నాగార్జున ట్వీటారు. ‘నువ్వే దిక్కని దేవుడికి మొక్కినా దేవుడు పంపేదీ పోలీసోడినే’ అని పూరీ అన్నారు.


రక్షించేది వారే

‘మా ట్రైలర్లు, టీజర్లు లైక్‌ చేయకపోయినా ఫర్లేదు. ఈ వార్త మాత్రం ట్రెండింగ్‌ చేయండి’ అని హరీశ్‌ శంకర్‌ ట్వీట్‌ చేశారు. ‘మానవ హక్కులనేవి మనుషులకు. మృగాళ్లకు కాదు’ అన్న నిఖిల్‌ మాటలు కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇదే భావం ప్రజలందరిలోనూ కనిపిస్తోంది. దిశకు న్యాయం జరిగేలా పోరాడేందుకు ప్రేరణనిచ్చింది. మరణశిక్షను వ్యతిరేకించే మంచు లక్ష్మి సైతం రేపిస్టులకు మరణశిక్షే సరని అంటున్నారు. సమంత, రాశీఖన్నా, రకుల్‌ప్రీత్‌, అనిల్‌ రావిపూడి, కల్యాణ్‌ రామ్‌ మాటల్లో సంఘటన తాలూకు తీవ్రత కనిపిస్తోంది. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండే రవితేజ చెప్పిన ‘దిశకు జరిగిన న్యాయం ఇక్కడితో ఆగిపోవద్దు. ఇలాంటి ఘోరాలు జరగకుండా విద్యావ్యవస్థలో మార్పు చేయాలి. బాల్యంలోనే మార్పుకు బీజం పడాలి’ అన్న మాటలు ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ‘ఎక్కడ ఘోరం జరిగిందో అక్కడే న్యాయం జరగడం యాదృచ్ఛికం’ అని వివేక్‌ ఒబెరాయ్‌ అభిప్రాయపడ్డారు.


పశుప్రవృత్తి నివారించాలి

క్రీడాకారుల్లో ఎక్కువమంది నిందితులకు సరైన శిక్షే పడిందని భావిస్తున్నా కొందరు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఇది భవిష్యత్తు మృగాళ్లను ఆపగలదా?మరో ప్రశ్న. సమాజం అండతో పనిలేకుండా ప్రతి రేపిస్టునూ ఇలాగే శిక్షించగలరా?’ అని గుత్తా జ్వాలా అన్నారు. ఇలాంటి నేరాలకు మరణశిక్షకు తాను వ్యతిరేకం కాదని, ఏదైనా సరే చట్టం ప్రకారమే జరగాలని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నారు. ఇలాంటి ఎన్‌కౌంటర్లు భవిష్యత్తులో మళ్లీ అత్యాచార ఘటనలకు జరగకుండా ఆపలేవని వారు అభిప్రాయ పడుతున్నారు. మనుషుల్లో పశుప్రవృత్తిని నివారించడమే అసలు కర్తవ్యమన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.