
తాజా వార్తలు
రాజస్థాన్ సంక్షోభం... జ్యోతిరాదిత్య కామెంట్!!
దిల్లీ: రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై మధ్యప్రదేశ్‌కు చెందిన భాజపా ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత జ్యోతిరాదిత్య సింథియా కీలక వ్యాఖ్యలు చేశారు. సచిన్ పైలట్నుద్దేశిస్తూ ఆదివారం ట్వీట్ చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీపైనా విరుచుకుపడ్డారు. పార్టీ పరంగా పక్కన పెట్టడమే కాక.. సీఎం అశోక్ గహ్లోత్ నుంచి తన మాజీ సహచరుడు వేధింపులు ఎదుర్కోవడం చూస్తుంటే బాధగా ఉందని ట్వీట్ చేశారు. ప్రతిభకీ, సామర్థ్యానికీ కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు లేదని పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న జ్యోతిరాదిత్య ఈ ఏడాది మార్చిలో భాజపాలో చేరారు. ఆయనతో పాటు తన వెంట నడిచిన ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. వాస్తవానికి మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో యువనేతలైన జ్యోతిరాదిత్య, సచిన్ పైలట్లను పక్కనపెట్టి సీనియర్లకు సీఎం పదవులను కట్టబెట్టినప్పటి నుంచీ ఈ యువ నాయకత్వంలో అసంతృప్తి రాజుకొంది. ఈ నేపథ్యంలో జ్యోతిరాదిత్య కాంగ్రెస్‌ను వీడగా.. సీఎంపై అసంతృప్తితో సచిన్ పైలట్ ప్రస్తుతం తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో రాజస్థాన్‌లో రాజకీయ వేడి రాజుకొంది.