నియంత్రిత సాగే.. బాగు: కేసీఆర్‌
close

తాజా వార్తలు

Updated : 18/05/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నియంత్రిత సాగే.. బాగు: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా అవతరించేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మంచి నేలలు ఉన్నాయని, తెలంగాణ నేల స్వభావం ఎంతో అరుదైనదన్నారు. ఇక్కడి నేలల తత్వం వల్లే ఇక్రిశాట్‌ పెట్టారన్నారు. సమశీతోష్ణ పరిస్థితులు తెలంగాణకు వరమన్న ఆయన.. అందుకే పంటల ఉత్పత్తిలో రాష్ట్రం రికార్డు సృష్టిస్తోందన్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల రికార్డులను సైతం బద్ధలుకొడుతూ పురోగమిస్తోందని చెప్పారు. ఈ ఏడాది అద్భుతంగా పంటలు పండాయని చెప్పారు. సోమవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నీటిపారుదల ప్రాజెక్టులు వడివడిగా జరుగుతున్నాయి. ప్రాజెక్టుల ఫలాలు మనం చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు కూడా తెలంగాణలో తక్కువే. వృత్తి నైపుణ్యం కల్గిన రైతాంగం పుష్కలంగా ఉన్నారు. కొన్ని రకాల అరుదైన పండ్లకు తెలంగాణ కేంద్రంగా ఉంది. తెలంగాణ అవతరించాక దేశ చరిత్రలో లేనివిధంగా రైతు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. తెలంగాణలో అమలుచేసే పథకాలను అందరూ అనుసరిస్తున్నారు’’ అని చెప్పారు.  

రైతు బీమా రూ.1100 కోట్లకు పెంచాం 
‘‘రైతుబీమా ప్రారంభించిన తొలి సంవత్సరంలో రూ.700 కోట్లు చెల్లిస్తే.. ఈ ఏడాది రూ.1100 కోట్లు పైచిలుకు కట్టాం. సెంటు భూమి ఉన్నవారు చనిపోయినా వారం తిరగకుండా ఆ కుటుంబం ఖాతాలోకి రూ.5 లక్షలు జమచేస్తున్నాం. 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌ సరఫరా తెలంగాణలోనే ఉంది. ఉచితంగా నీటి తీరువా రద్దు చేసి నీరిచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణే. ఏ రాష్ట్రంలోనూ ఈ సదుపాయం లేదు. రైతులకు ప్రోత్సాహకాలు, రక్షణ కల్పనలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉంది. పీడీఎస్‌ కింద చరిత్రలో ఎన్నడూ లేనంతగా పంపిణీ చేస్తున్నాం’’ అని వివరించారు. 

నియంత్రిత సాగే.. బాగు!
‘‘రైతులు నియంత్రిత పద్ధతుల్లో పంటలు సాగు చేయాలి. ఈ ఏడాది ఏ పంటలు వేయాలి.. ఎలా వేయాలో చర్చించాం. నియంత్రిత పద్ధతుల్లో పంటలు సాగుచేసేందుకు రైతులు ముందుకు రావాలి. అందరూ ఒకే పంట వేసి ఇబ్బంది పడేకంటే మార్కెట్లో డిమాండ్‌ ఉండే పంటలు పండిస్తే మంచి ధరలు పొందవచ్చు. గ్రామాల్లో రైతుల వద్దకు వెళ్లి మద్దతు ధరకు ప్రభుత్వమే కొంటుంది. రైతులు నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలి. నియంత్రిత విధానంపై వ్యవసాయ, పౌరసరఫరాల మంత్రులు, శాస్త్రవేత్తలతో చర్చించాం. తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పత్తి పండుతోంది. తెలంగాణ పత్తికి పింజ పొడుగు, పత్తితో దూదిశాతం ఎక్కువగా ఉంటుంది’’ అన్నారు.  

కందుల్ని పూర్తిగా ప్రభుత్వమే కొంటుంది
‘‘70లక్షల ఎకరాల్లో పత్తి పండించాలి. గతేడాది 53లక్షల ఎకరాల్లో పండించారు. ప్రాజెక్టులతో నీళ్లు వచ్చాయి గనక వాటితో, బోర్ల కింద పత్తి పంటలు వేయండి. పత్తి దిగుబడి బాగా వస్తుంది. లాభసాటిగా ఉంటుంది. వర్షా కాలంలో 40లక్షల ఎకరాల్లో వరిచేను వేద్దాం. గతేడాది అలాగే వేశాం. వరిపంటలో ఏ రకాలు సాగు చేయాలో ప్రభుత్వం చెబుతుంది. అలాగే చేయాలి. మక్క పంటలు వర్షాకాలంలో వద్దు. పత్తి, కంది వేయండి. మక్క వేస్తే కొనేవాళ్లు లేరు. కంది పంట మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. 15లక్షల ఎకరాల్లో కంది పంటను సంతోషంగా వేసుకోవచ్చు. మరో 2లక్షల ఎకరాల్లో కూరగాయలు పండించవచ్చు’’ అని సూచించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని