
తాజా వార్తలు
తిరుగుబాట్లను నివారించాలి
ఎన్నికలు ముగిసిన వెంటనే పార్టీ, కార్పొరేషన్ పదవులు
మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్
పురపాలక సంఘాల వారీగా సమీక్ష
ఈనాడు - హైదరాబాద్
పురపాలక, నగర పాలక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలవాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. అసమ్మతి, తిరుగుబాటు సమస్యలు లేకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న పది రోజులు కష్టపడి పనిచేయాలని, ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని సూచించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే పార్టీ, కార్పొరేషన్ పదవులుంటాయని చెప్పారు. శనివారం తెలంగాణభవన్‌లో ఆయన పురపాలక ఎన్నికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పురపాలక సంఘాల వారీగా పార్టీ అభ్యర్థులు, పరిస్థితులపై చర్చించారు. సీఎం కేసీఆర్ చేసిన మార్గనిర్దేశనం మేరకు పనిచేయాలని, ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రచారం ఉండాలన్నారు. బీ-ఫారాల అందజేత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పార్టీ నుంచి తిరుగుబాటు అభ్యర్థులుంటే వారిని బుజ్జగించి, నామినేషన్లను ఉపసంహరింప చేయాలన్నారు. వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని మంత్రులు తమ జిల్లాల్లో అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని సూచించారు.
పీర్జాదిగూడ పరిణామాలపై అసంతృప్తి
* మేడ్చల్ నియోజకవర్గంలోని పీర్జాదిగూడ నగరపాలక సంస్థలో జరుగుతున్న పరిణామాలపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తంచేశారని తెలిసింది. దీనిపై మంత్రి మల్లారెడ్డి వివరణ కోరగా.. అత్యధిక పురపాలక సంఘాల ఎన్నికలున్న తమ జిల్లాలో తిరుగుబాట్లని నిరోధించేందుకు యత్నిస్తున్నామని, అన్ని స్థానాలను గెలుస్తామని మంత్రి పేర్కొన్నట్లు తెలిసింది. అసమ్మతికి అవకాశం ఇవ్వొద్దని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించినట్లు సమాచారం.
* మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు వేరే పార్టీ పేరిట పలు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారనే ఫిర్యాదుపై జూపల్లి, మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహంలతో కేటీఆర్ మాట్లాడారు. నామినేషన్లు వేసింది తమ అభ్యర్థులు కాదని జూపల్లి వివరించినట్లు తెలిసింది.
* తాండూరులో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అనుచరులు నామినేషన్లు వేశారని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆరోపించగా కేటీఆర్ దీనిపై చర్చించినట్లు తెలిసింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తాండురు పరిస్థితిని కేటీఆర్‌కు వివరించినట్లు సమాచారం.
* ఆమన్‌గల్ పురపాలక సంఘంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అనుచరులు నామినేషన్లు వేయగా దీనిపైనా నారాయణరెడ్డితో పాటు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కేటీఆర్ మాట్లాడారు.
* నాగర్‌కర్నూల్ జిల్లాలోని పరిస్థితిని మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు. ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్తా, రెడ్యానాయక్, డాక్టర్ సంజయ్ కుమార్, కోనేరు కోనప్ప, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, రవిశంకర్, బొల్లం మల్లయ్యయాదవ్, గాదరి కిశోర్, గొంగిడి సునీత, విఠల్‌రెడ్డి, సుధీర్ రెడ్డి, నోముల నర్సింహయ్య, జైపాల్ యాదవ్, క్రాంతి కిరణ్, రవీంద్ర కుమార్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ వివిధ పురపాలక సంఘాల పరిస్థితులను వివరించారు. కేటీఆర్‌తో సమావేశం అనంతరం జూపల్లి విలేకరులతో మాట్లాడుతూ, తాను నేను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని. తిరుగుబాటు అభ్యర్థుల విషయంలో తనకెలాంటి సంబంధం లేదని అన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ, తెరాసలో పోటీ ఎక్కువగా ఉందని, టికెట్రాని వారిని బుజ్జగిస్తున్నామన్నారు. మల్లారెడ్డి మాట్లాడుతూ, తన అనుచరుడు దయాకర్‌రెడ్డి తెరాసలో ఉంటారని స్పష్టంచేశారు.
దివ్యాంగ నేతల భేటీ
తెలంగాణ దివ్యాంగుల సంఘం నేతలు కార్పొరేషన్ ఛైర్మన్ వాసుదేవరెడ్డి నేతృత్వంలో కేటీఆర్‌ను కలిశారు. తమకు విద్యాఉపాధి అవకాశాలు కల్పించాలని నేతలు రాజేందర్ తుడుం, మహ్మద్ మురాద్, పైడి, మల్లికార్జున్, గుండు రవిలు పాల్గొన్నారు.