
తాజా వార్తలు
ప్రజల ప్రయోజనాలే ముఖ్యం: కేటీఆర్
హైదరాబాద్: కేవలం డబ్బులు ఖర్చు చేయడమే అభివృద్ధి కాదని.. ప్రగతికి కావాల్సిన విధానాలు తీసుకురావడం, ఆలోచనలు చేయడం, వాటిని సమర్థంగా ఆచరణలో పెట్టడమే అసలైన అభివృద్ధి అని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన స్థిరాస్తి వ్యాపారుల సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. సంస్కరణలు అమలు చేసి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరేలా చేయాలన్నారు. ఇవన్నీ జరగాలంటే రాష్ట్రంలో ఒక స్థిరమైన ప్రభుత్వం ఉండాలని.. అప్పుడే ప్రైవేటు రంగం ఒడిదొడుకులకు గురికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1.12 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం ఉందని.. పట్టణ, గ్రామీణ భూముల ధరలు, ఆస్తులను అన్లాక్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్తులను అన్లాక్ చేస్తే రూ.వేల కోట్ల ఆర్థిక కార్యకలాపాలకు మార్గం సుగమం అవుతుందని కేటీఆర్ వివరించారు.
ప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టకూడదు..
‘‘హైదరాబాద్లో వరదలు వస్తే తట్టుకునేలా కార్యాచరణ చేపడతాం. దేశంలోని సీసీ కెమెరాల్లో 65 శాతం హైదరాబాద్లోనే ఉన్నాయి. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది. మతపరమైన ఘర్షణలు ఎక్కడా లేవు. సరైన అభివృద్ధి అజెండా లేకుండా ప్రతిపక్షాలు ముందుకు వెళ్తున్నాయి. వేర్పాటువాద అజెండాతో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. విభజన రాజకీయాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. హైదరాబాద్ పాకిస్థాన్లో ఉందా? చైనాలో ఉందా?రాజకీయాల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. నగరం, రాష్ట్రం శాశ్వతం.. ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. ఓట్ల కోసం ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టకూడదు. విద్వేషపూరిత వ్యాఖ్యలతో రాష్ట్రానికి పెట్టుబడులు రావు. మతం అజెండాతో జనహితం మర్చిపోతున్నారు. హైదరాబాద్ పేరు భాగ్యనగరంగా మారుస్తామని చెబుతున్నారు. పేరు మారిస్తే హైదరాబాద్ వెంటనే బంగారుమయం అవుతుందా? ఉద్వేగాలు రెచ్చగొట్టడం సులభం. నేమ్ ఛేంజర్లు, గేమ్ ఛేంజర్లు మనకు అక్కర్లేదు. హైదరాబాద్లో అరాచకం కావాలా? ప్రజలే ఆలోచించాలి’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయం
‘‘ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లలో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయం. ఇప్పటివరకు ధరణిలో 1.55 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి నమోదైంది. వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాస్ పుస్తకం అందజేస్తాం. నిజాం హయాంలో 55 లక్షల ఎకరాల భూమి వారి వద్దే ఉండేది. వారి చేతిలోని భూమి క్రమంగా ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ఆస్తులను క్రమబద్ధీకరిస్తున్నాం. నిజమైన యజమానికి హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రభుత్వానికి కూడా ఆస్తి పన్ను సమకూరుతుంది. ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి డిజిటలైజేషన్ చేస్తాం. భూముల వివాదాలు క్రమంగా సమసిపోయేలా చేస్తున్నాం’’ అని కేటీఆర్ వివరించారు.