
తాజా వార్తలు
హైదరాబాద్ x దిల్లీ: వీరి రికార్డులు అమోఘం!
టీ20 లీగ్‌లో కొత్త రికార్డులు
ఇంటర్నెట్‌డెస్క్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దిల్లీ రెండో క్వాలిఫయర్‌లో హైదరాబాద్‌పై విజయం సాధించింది. దీంతో తొలిసారి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. 190 పరుగుల లక్ష్య ఛేదనలో వార్నర్ టీమ్ 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. రబాడ 4/29, మార్కస్ స్టోయినిస్ 3/26 అద్భుతమైన బౌలింగ్ చేశారు. దాంతో హైదరాబాద్ 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌లో పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి.
రబాడ
*రబాడ ఈ సీజన్లో ఇప్పటివరకు 29 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు 25 వికెట్లతో ఉన్న అతడు హైదరాబాద్‌పై 4 వికెట్లు తీసి బుమ్రా(27)ను అధిగమించాడు. దీంతో దిల్లీ తరఫున ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. మరో 3 వికెట్లు తీస్తే ఈ టీ20 లీగ్‌లో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన డ్వేన్‌బ్రావో(32) రికార్డును చేరుకుంటాడు.
మార్కస్ స్టోయినిస్
* ఈ టీ20 లీగ్‌లో దిల్లీ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ రికార్డు నెలకొల్పాడు. ప్లేఆఫ్స్‌లో ఒకే మ్యాచ్‌లో 30కి పైగా పరుగులు, 3కు పైగా వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు 2008లో షేన్‌వాట్సన్ 52 పరుగులు, 3/10.. అదే ఏడాది యూసుఫ్ పఠాన్ 56, 3/22.. 2010లో కీరన్ పొలార్డ్ 33*, 3/17.. 2018లో రషీద్‌ఖాన్ 34*, 3/19 ఈ ఘనత సాధించారు.
శిఖర్ ధావన్
* ఎప్పుడూ లేనంతగా శిఖర్ ధావన్ ఈ సీజన్లో రెచ్చిపోయాడు. రెండు వరుస శతకాలతో పాటు నాలుగు అర్ధశతకాలతో మొత్తం 603 పరుగులు చేశాడు. దీంతో ఈ టోర్నీలో తొలిసారి 600 పరుగుల రికార్డు మార్కును చేరుకున్నాడు. ధావన్ కన్నా కేఎల్ రాహుల్ 670 ఈసారి ముందున్నాడు.
రషీద్ ఖాన్
(Photo: Rashid Khan Twitter)
* ఈ మ్యాచ్‌లో హైదరబాద్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ ఒక వికెట్ తీయడంతో సీజన్లో మొత్తం 20 వికెట్లు పడగొట్టాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. 16 మ్యాచ్‌లాడిన రషీద్ ఈ సీజన్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 5.37 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఒక సీజన్లో 20కి పైగా వికెట్లు తీసి 6 కన్నా తక్కువ ఎకానమీ నమోదు చేసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. అతడికన్నా ముందు అనిల్ కుంబ్లే 2009లో 21 వికెట్లు తీసి 5.86 ఎకానమీ సాధించాడు. సునీల్ నరైన్ 2012లో 24 వికెట్లు 5.48 ఎకానమీ, మరుసటి ఏడాది 22 వికెట్లు 5.47 ఎకానమీ నమోదు చేశాడు. తర్వాత లసిత్ మలింగ 2011లో 28 వికెట్లతో 5.95 ఎకానమీ సాధించాడు.