
తాజా వార్తలు
ఫైనల్స్ చేరకపోవడం సిగ్గుగా అనిపిస్తోంది..
అయినా ఆటగాళ్లు గర్వపడొచ్చు: కేన్ విలియమ్సన్
ఇంటర్నెట్‌డెస్క్: హైదరాబాద్ ఫైనల్స్‌కు చేరకపోవడం సిగ్గుగా అనిపిస్తోందని.. అయినా ఆటగాళ్లు తమ ప్రదర్శనతో గర్వపడొచ్చని మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. గతరాత్రి దిల్లీతో తలపడిన రెండో క్వాలిఫయర్‌లో వార్నర్ టీమ్ 17 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. విలియమ్సన్(67), అబ్దుల్ సమద్(33) రాణించినా కీలక సమయంలో ఔటయ్యారు. దీంతో హైదరాబాద్ అవకాశాలకు గండిపడింది. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన విలియమ్సన్ ఫైనల్స్‌కు చేరకపోవడంపై విచారం వ్యక్తం చేశాడు.
‘దిల్లీ అద్భుతమైన జట్టు. మాలాగే వాళ్లు కూడా సహజసిద్ధమైన ఆటకోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సమష్టిగా రాణించి ఆధిపత్యం చలాయించారు. మాముందు పెద్ద లక్ష్యాన్ని ఉంచడంతో రెండో ఇన్నింగ్స్‌లో రిస్కు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే మాకు శుభారంభం దక్కకపోయినా మధ్యలో ధాటిగా ఆడి పరిస్థితుల్ని చక్కబెట్టాం. దాంతో మాకు గెలుపొందే అవకాశం దక్కినా ఓడిపోయాం. ఫైనల్స్‌కు చేరకపోవడం సిగ్గుగా ఉంది. కానీ ఆటగాళ్లు తమ ప్రదర్శన పట్ల గర్వంగా ఉండొచ్చు’ అని విలియమ్సన్ పేర్కొన్నాడు.
ఈ సీజన్లో కొన్ని మ్యాచ్‌ల్లో గెలుపుటంచుల దాకా వెళ్లి ఓటమిపాలైనట్లు కేన్ వెల్లడించాడు. ఒక జట్టుగా తమ సహజసిద్ధమైన ఆటను కనుగొనేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. సరైన సమయంలో గాడిలో పడ్డా ఫైనల్స్‌కు చేరి ఉంటే సంతోషంగా ఉండేదన్నాడు.