
తాజా వార్తలు
బొంబాయి హైకోర్టును ఆశ్రయించిన కంగన
* మూడోసారి సమన్లు జారీ చేసిన ముంబై పోలీసులు
* ఎఫ్ఐఆర్ను రద్దు చేయాల్సిందిగా నటి అభ్యర్థన
ముంబై: నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి సోమ, మంగళవారాల్లో తమ ముందు హాజరు కావాలని మహరాష్ట్ర పోలీసులు మూడోసారి సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కంగన తమపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాల్సిందిగా బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. కంగన, రంగోలి సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఫిట్నెస్ ట్రైనర్ మున్వర్అలీసయ్యద్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారిని విచారించేందుకు ముంబై పోలీసులు ఇప్పటికే రెండుసార్లు సమన్లు జారీ చేశారు. అయినా వారు హాజరు కాలేదు. వారిరువురూ తమ సోదరుడి వివాహ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నామని తమ న్యాయవాది ద్వారా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పోలీసులు మూడోసారి సమన్లు జారీ చేయగా వారు బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో పోలీసులు సరైన విచారణ చేయట్లేదని కంగనా, రంగోలి తమ ట్వీట్లలో విమర్శలు గుప్పించారు. అదే సమయంలో చాలామంది నటీనటులపై వ్యక్తిగత విమర్శలు చేశారు. వారు బాలీవుడ్ ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని మున్వర్ అలీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేయాలని బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటు కోర్టు ముంబై పోలీసులను ఆదేశించారు.