
తాజా వార్తలు
‘కంగన విసుగొస్తోంది.. ఇక ఆపు..!’
అభిమానుల కామెంట్లు.. నటి రిప్లై
ముంబయి: ఫ్యాషన్ నుంచి పాలిటిక్స్ వరకు.. విషయం, వివాదం ఏదైనా సరే తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్పే కథానాయిక కంగనా రనౌత్. ఈ క్రమంలోనే ఆమె అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. గత కొన్ని రోజులుగా ట్విటర్లో చాలా చురుకుగా ఉంటున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం, హత్యాచారాలు, అర్ణబ్ గోస్వామి అరెస్టు.. ఇలా రకరకాల అంశాలపై గళం విప్పారు. ఆమె ట్విటర్లో తరచూ స్పందించడం కొంతమంది అభిమానులకు నచ్చలేదు. ఒకే అంశం గురించి పదేపదే మాట్లాడుతుంటే బోరింగ్‌గా ఉందని, కాస్త మౌనంగా ఉండమని సలహాలు ఇచ్చారు.
వీరిని ఉద్దేశిస్తూ కంగన ట్వీట్ చేశారు. ‘రోజంతా నా ట్వీట్లు తనిఖీ చేస్తూ.. విసుగు చెందామని.. మౌనంగా ఉండమని కోరిన అభిమానులు నన్ను మ్యూట్ చేయండి, అన్‌ఫాలో అవ్వడండి, లేదా బ్లాక్ చేయండి. అలా చేయకపోతే స్పష్టంగా మీ ఆసక్తి మొత్తం నాపై ఉన్నట్లే. నన్ను ద్వేషించే వారిలా ప్రేమించొద్దు..’ అని ఆమె పేర్కొన్నారు.
ప్రముఖ పాత్రికేయుడు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 2018లో ఓ ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు కారణమైన కేసులో నవంబరు 4న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కుట్రకు పాల్పడి అర్ణబ్‌ను అరెస్టు చేసిందని కంగన ఆరోపించారు. ‘బాలీవుడ్లో డ్రగ్ మాఫియా, చిన్నారుల అక్రమ రవాణా గురించి అందరికీ తెలిపినందుకు, సోనియా జీని అసలు పేరుతో పిలిచినందుకు అర్ణబ్‌ను హింసిస్తున్నారు’ అంటూ వీడియో షేర్ చేశారు.