close
Array ( ) 1

తాజా వార్తలు

ధోనీ టీ20 ప్రపంచకప్‌లో ఆడాలంటే.. 

నేనూ ధోనీ అభిమానినే.. అయినా: కపిల్‌ దేవ్‌

దిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే ధోనీ వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని భారత దిగ్గజం, 1983 ప్రపంచకప్‌ విజేత కపిల్‌దేవ్‌ అభిప్రాయపడ్డారు. గురువారం హెచ్‌సీఎల్‌ గ్రాంట్‌ ఈవెంట్‌ ఐదో ఎడిషన్‌లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ధోనీ ఆడటంలో పెద్ద విశేషమేమీ లేదని కపిల్‌ అభిప్రాయపడ్డారు. గతేడాది వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా న్యూజిలాండ్‌తో టీమ్‌ఇండియా ఓడిపోయాక మహీ ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతని భవితవ్యంపై అనేక వార్తలు వినిపించాయి. మరో నెల రోజుల్లో ఐపీఎల్‌ ప్రారంభమవుతుండగా, మార్చి 2 నుంచి ధోనీ ప్రాక్టీస్‌ మొదలెట్టే అవకాశముందని తెలుస్తోంది. 

‘ఐపీఎల్‌లో ధోనీ ఒక్కడే ఆడట్లేదు. మరో పదేళ్లు మనం గర్వించే ఆటగాళ్లని చూడాలని కోరుకునే వాళ్లలో నేనొకడిని. నాకు తెలిసి దేశం కోసం ధోనీ ఇప్పటికే చాలా చేశాడు. ఒక అభిమానిగా అతను టీ20 ప్రపంచకప్‌లో ఉండాలనుకుంటున్నా. ఒక క్రికెటర్‌గా మాత్రం.. జట్టు యాజమాన్య నిర్ణయానికే కట్టుబడి ఉంటా. ధోనీ ఇప్పటికే చాలా కాలం ఆటకు దూరమయ్యాడు. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే మెగా సమరంలో ఆడాలంటే ఇకపై చాలా మ్యాచ్‌లు ఆడాలి. ప్రస్తుతం అతని కెరీర్‌ చివరి దశలో ఉంది. ఒక అభిమానిగా ధోనీని ఐపీఎల్‌లో చూడాలని ఉన్నా.. కొత్త తరానికే ప్రాధాన్యత ఇస్తా’ అని కపిల్‌ అన్నారు. ఈ సందర్భంగా కివీస్‌ పర్యటనలో విఫలమవుతున్న ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫామ్‌లపై కపిల్‌ స్పందించారు. ఆటగాళ్లు గాయపడి కోలుకున్నప్పుడు శరీరానికి తగిన సమయం అవసరమని, దానికెంతో సమయం పట్టదన్నారు. ఒక మంచి స్పెల్‌తో బుమ్రా తిరిగి గాడిలో పడతాడని మాజీ సారథి వివరించారు. 

అలాగే కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ సైతం పుంజుకుంటాడని కపిల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ను తొలి టెస్టులో ఆడించకపోవడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని, అది యాజమాన్య నిర్ణయమని టీమ్‌ఇండియా దిగ్గజం వివరించారు. ఇక వెల్లింగ్టన్‌ టెస్టులో ఘోరంగా విఫలమైన టీమ్‌ఇండియా రెండో మ్యాచ్‌లో రాణిస్తుందని, గతంలో బౌన్సీ పిచ్‌లైన పెర్త్‌, మెల్‌బోర్న్‌, డర్బన్‌ లాంటి వేదికలపై గెలవలేదా అని ప్రశ్నించారు. తదుపరి టెస్టులో టీమ్‌ఇండియా కచ్చితంగా మెరుస్తుందని, లేకపోతే న్యూజిలాండ్‌కు క్రెడిటివ్వాలన్నారు. చివరగా మహిళల టీ20 ప్రపంచకప్‌పై స్పందిస్తూ.. హర్మన్‌ప్రీత్‌ సేన బాగా ఆడుతుందని ప్రశంసించారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినందుకు బీసీసీఐను అభినందిస్తున్నట్లు చెప్పారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.