
తాజా వార్తలు
'పల్స్ ఆక్సీమీటర్ల'తోనే మరణాల కట్టడి: కేజ్రీవాల్
'సురక్షా కవచాలు'గా అభివర్ణించిన దిల్లీ ముఖ్యమంత్రి
దిల్లీ: 'పల్స్ ఆక్సీమీటర్ల' సాయంతో దేశ రాజధానిలో కొవిడ్ మరణాల సంఖ్యను తగ్గించగలుగుతున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. 'సురక్షా కవచాలు'గా అభివర్ణించిన కేజ్రీవాల్, హోం క్వారంటైన్లో ఉన్న కొవిడ్ రోగులకు ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు. వీటి సాయంతో ఎవరైనా కరోనా రోగి ఆక్సిజన్ స్థాయి తగ్గుతున్నట్లు గుర్తించిన వెంటనే వారి ఇంటికే ఆక్సిజన్ సదుపాయాన్ని పంపించడమో లేదా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించడమో చేస్తున్నామని కేజ్రీవాల్ ట్విటర్లో పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకిన తన మిత్రునికి 'పల్స్ ఆక్సీమీటర్'ను సకాలంలో అందించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటూ ఓ వ్యక్తి కేజ్రీవాల్‌కు ట్వీట్ చేశారు. దీనికి కేజ్రీవాల్ పైవిధంగా స్పందించారు.
స్వల్ప లక్షణాలతో హోం క్వారంటైన్లో ఉన్న కరోనా రోగుల్లో ఆక్సిజన్ స్థాయి ఒక్కసారిగా పడిపోతున్నట్లు ఈ మధ్య దిల్లీ అధికారులు గుర్తించారు. దీన్ని అధిగమించేందుకు ఇంట్లో క్వారంటైన్లో ఉన్న కరోనా రోగులకు 'పల్స్ ఆక్సీమీటర్ల'ను అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతో గత కొన్నిరోజులుగా అవసరమున్న రోగులకు దిల్లీ ప్రభుత్వం దీన్ని అందజేస్తోంది.
'పల్స్ ఆక్సీమీటర్' పరికరాన్ని చేతి వేలుకు అమర్చుకోవడం ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సీజన్ ఏ స్థాయిలో సరఫరా అవుతుందో తెలుసుకోవచ్చు. శ్వాసకోశ వ్యాధులు, ఆస్థమా, గుండె జబ్బులున్న వారు కరోనా బారినపడినప్పుడు వారికి కృత్రిమ శ్వాస అవసరమో లేదో దీని ద్వారా తెలుసుకునే వీలుంటుంది. దిల్లీలో ఇప్పటికే ఆసుపత్రులపై ఒత్తిడి పెరగడంతో ఎక్కువ శాతం కరోనా సోకిన వారిని ఇళ్లలోనే ఉండాలని అక్కడి ప్రభుత్వం సూచిస్తోంది. వారికి ఇలాంటి పల్స్ ఆక్సీమీటర్లు కూడా అందజేస్తోంది. పల్స్ స్ధాయులు తగ్గితే మాత్రం వెంటనే వారికి ఆక్సిజన్‌ను అందించడం, లేదా ఆసుపత్రులకు తరలిస్తోంది. అయితే రోగి కోలుకున్న తర్వాత ఆ పరికరాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది.
ఇదిలాఉంటే, దిల్లీలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఆదివారం నాటికి దిల్లీలో 1,10,921పాజిటివ్ కేసులు నమోదుకాగా వీరిలో 3334 మంది మృత్యువాతపడ్డారు.
ఇవీ చదవండి..
భారత్‌లో ఒక్కరోజే 29వేల కేసులు
రష్యా వ్యాక్సిన్.. క్లినికల్ ట్రయల్స్ పూర్తి