కరోనాపై యుద్ధానికి 5 ఆయుధాలు: కేజ్రీవాల్‌
close

తాజా వార్తలు

Published : 28/06/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై యుద్ధానికి 5 ఆయుధాలు: కేజ్రీవాల్‌

దిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దిల్లీలో రోజురోజుకీ విజృంభిస్తున్న ఈ మహమ్మారి కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. ఐదు అంశాలను ఆయుధాలుగా చేసుకొని కరోనాపై పోరాటం సాగిస్తున్నట్టు చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనాపై యుద్ధానికి ఆస్పత్రుల్లో రోగులకు పడకలు పెంచడం, టెస్టింగ్ - ఐసోలేషన్‌, ఆక్సీమీటర్ల పంపిణీ, ప్లాస్మా థెరఫీ, ఇంటింటి సర్వే- స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహణ.. ఈ ఐదు అంశాలను ఆయుధాలుగా చేసుకొని ‘కరోనా హారేగా ఔర్ ఢిల్లీ జీతేగా’ అనే నినాదంతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు. 

7500 పడకలు ఖాళీగా ఉన్నాయ్‌!

ఇప్పటివరకు దిల్లీలో 13500 పడకలు ఏర్పాటు చేయగా.. వాటిలో 6000 పడకలు మాత్రమే వినియోగంలో ఉన్నాయనీ.. మిగతా 7500 పడకలు ఖాళీగా ఉన్నట్టు వివరించారు. నిరంతరం కరోనా కట్టడికే కృషిచేస్తున్నామన్న కేజ్రీవాల్‌.. భవిష్యత్తులో కేసుల సంఖ్య పెరిగితే అందుకవసరమైన వసతుల కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. తమకు టెస్టింగ్‌ కిట్లను అందుబాటులో ఉంచిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. 

పరీక్షలు నాలుగింతలు పెంచాం

గతంతో పోలిస్తే దిల్లీలో కరోనా నిర్ధారణ పరీక్షలను నాలుగు రెట్టు పెంచినట్టు సీఎం తెలిపారు. ప్రస్తుతం రోజుకు 20వేల పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశంలో అత్యధికంగా పరీక్షలు చేస్తున్నామన్న ఆయన.. ఇప్పటివరకు దిల్లీలో 4,59,156 పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.  నిన్న ఒక్క రోజే అత్యధికంగా 21,144 పరీక్షలు చేశామన్నారు. భారీగా టెస్ట్‌లు చేయడం, రోగులను ఐసోలేషన్‌ చేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు చెప్పారు. 

నగరంలో హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగులకు ఆక్సీమీటర్లను పంపణీ చేస్తున్నట్టు కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను తెలుసుకొనేందుకు వీటిని పంపిణీ చేస్తున్నామనీ.. ఎవరికైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వారిని ఆస్పత్రుల్లో చేర్చేలా వైద్య బృందాలను సిద్ధంచేసినట్టు తెలిపారు.  మరోవైపు ఈ రోజు నుంచి నగరంలో 20వేల మందికి సీరలాజికల్‌ సర్వే నిర్వహిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. 

ప్రాణ రక్షకుడిగా ప్లాస్మాథెరఫీ

దిల్లీలో ప్లాస్మాథెరఫీ ప్రాణ రక్షకుడిగా మారిందని సీఎం అన్నారు. ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో ఈ చికిత్సను ప్రారంభించక ముందు నాటి పరిస్థితితో పోలిస్తే మరణాలను సగం తగ్గించగలిగామని తెలిపారు. 

దిల్లీలో నిన్న 3460 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య  77240కి పెరిగిన విషయం తెలిసిందే. వీరిలో 47091మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 2492మంది ప్రాణాలు కోల్పోయారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని