close

తాజా వార్తలు

Published : 18/10/2020 18:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిర్లక్ష్యానికి..కేరళ మూల్యం చెల్లిస్తోంది!

రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో నిర్లక్ష్యం వహించినందుకు ప్రస్తుతం కేరళ రాష్ట్రం మూల్యం చెల్లిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అభిప్రాయపడ్డారు. ఓనం ఉత్సవాల సందర్భంగా కరోనా నిబంధనలను పక్కన పెట్టినందుకు ఇప్పుడు తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఆయన స్పష్టంచేశారు. ‘సండే సంవాద్‌’ పేరుతో ప్రతి ఆదివారం సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలతో మాట్లాడే కార్యక్రమంలో హర్షవర్ధన్‌ ఈ విధంగా హెచ్చరించారు.

‘ఓనం ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలు భారీ సమూహాలుగా తిరిగారు. ఆ సమయంలో సరైన జాగ్రత్తలు పాటించలేదు. ఆ నిర్లక్ష్యానికి కేరళ ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది’ అని హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రం కూడా కేరళలో ఉన్న పరిస్థితులను చూసి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముందన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ సంప్రదాయ పద్ధతిలో వారి ఇంటివద్దే పండుగ జరుపుకోవాలని దేశప్రజలకు హర్షవర్ధన్‌ సూచించారు.

ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్‌ 2వరకు రాష్ట్రవ్యాప్తంగా ఓనం వేడుకలు జరిగాయి. ఇవి పూర్తైన కొన్ని రోజులకే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా సెప్టెంబర్‌ 8 నుంచి కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఇలా సెప్టెంబర్‌ నెలలోనే దాదాపు 32శాతం పెరుగుదల నమోదైందని కేంద్రం నియమించిన ఓ కమిటీ స్పష్టం చేసింది. ఇక జనవరి 30- మే 3 మధ్యకాలంలో కేరళలో కేవలం 499 కేసులు, రెండు మరణాలు మాత్రమే చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా నియంత్రించగలిగింది. కానీ, ఓనం పండుగ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం నిత్యం దాదాపు పదివేల కేసులు బయటపడుతున్నాయి. ఈ సమయంలో కేరళను చూసి ప్రతిరాష్ట్రం పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని కేంద్ర మంత్రి రాష్ట్రాలను అప్రమత్తం చేశారు.

ఇదిలా ఉంటే, కేరళలో ఇప్పటివరకు కరోనావైరస్‌ కేసుల సంఖ్య 3లక్షల 30వేలకు చేరుకోగా, వీరిలో 1139 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో తొలి యాభైవేల కేసులు నమోదుకావడానికి 203 రోజులు పట్టగా, తర్వాత 50వేల కేసులు కేవలం 23రోజుల్లోనే నమోదయ్యాయి.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని