close

తాజా వార్తలు

డెత్‌వారెంట్‌ ప్రకారం నిర్భయ దోషులకు శిక్ష

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌: నిర్భయ దోషులకు శిక్ష అమలుపై కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను తూచ తప్పకుండా అమలు చేస్తామని.. డెత్‌వారెంట్‌ ప్రకారం శిక్ష అమలువుతుందని వెల్లడించారు. న్యాయవ్యవస్థలో ఉన్న అనేక లొసుగుల ఆధారంగా నేరస్థులు అనేక కారణాలతో శిక్షలు అమలుకాకుండా ఆలస్యం అయ్యేలా చేస్తున్నారు. మరోవైపు ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల్లో రానున్న రోజుల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని కిషన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నిమయించిందని.. కమిటీ ఒక డ్రాఫ్ట్‌ను కూడా సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ డ్రాఫ్ట్‌పై అభిప్రాయాలు సేకరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రులు, డీజీపీలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులకు పంపించనున్నట్లు కిషన్‌ రెడ్డి తెలిపారు.

ఇప్పటికే పోక్సో చట్టంలో కేంద్రం పలుమార్పులు చేసినట్లు కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. తద్వారా 18 ఏళ్ల లోపువారిపై నేరాలకు పాల్పడ్డ దోషులకు రెండు నెలల్లోపే శిక్ష పడేందుకు అవకాశం ఉంటుందన్నారు. వరంగల్‌లో చిన్నారిపై జరిగిన అత్యాచారం కేసులో 51 రోజుల్లో శిక్ష పడిందని.. నిర్భయ కేసులోనూ డెత్ వారెంట్ ప్రకారం ఉరి అమలు చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిర్భయ తరహా ఘటనల్లో దోషులకు క్షమాపణ తగదని రాష్ట్రపతి గతంలోనే పేర్కొన్నారని గుర్తు చేశారు. హోంశాఖకు వచ్చిన క్షమాభిక్ష పిటిషన్‌పై మేం ఏమాత్రం జాప్యం చేయకుండా నిర్ణయం తీసుకున్నామని కిషన్‌ రెడ్డి వివరించారు.

అలా చేయడం ప్రతిపక్షాలకు తగదు

జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌పీఆర్ కోసం వివరాలు సేకరించే విషయంలో ప్రజలపై ఎలాంటి ఒత్తిడి ఉండదన్నారు. ప్రజలు ఇచ్చే వివరాల ఆధారంగానే సంక్షేమ పథకాలు అమలు అవుతాయన్నారు. జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌)కు జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)తో ముడిపెట్టాల్సిన అవసరం లేదన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ మూడు వేర్వేరు ప్రక్రియలని కిషన్‌ రెడ్డి వివరించారు. 150 ఏళ్లుగా ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు సేకరిస్తున్నామన్నారు. జన గణన ఆధారంగానే 2026లో పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల సంఖ్య నిర్ణయిస్తామని.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జన గణన ఆధారంగానే గ్రామీణ, పట్టణ జనాభాలో మార్పులు.. రైతులు, వ్యవసాయ కూలీలు, ఇల్లు లేని పేదలు తదితర వివరాలు తెలుస్తాయన్నారు. అలాంటి జన గణనను వ్యతిరేకించడం ప్రతిపక్షాలకు ఏమాత్రం తగదని హితవు పలికారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.