close
Array ( ) 1

తాజా వార్తలు

జ్ఞానానికి దగ్గరి దారి!

ఈనెల 30 రమణ మహర్షి జయంతి

కనిపించేదంతా భగవత్‌ స్వరూపమే అయినప్పుడు అంతటిపై భక్తి ఉండాల్సిందే... సాటి మనుషులైనా, సర్వ ప్రాణులైనా... అన్నీ ఆత్మ స్వరూపాలే... నీలో ఉన్నదే ఆ జీవుల్లోనూ ఉంది. అందుకే నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో, అన్నిటినీ అలాగే ప్రేమించాలి. పూజించాలి. ఇదే రమణులు చెప్పిన భక్తి తత్త్వం. ఆయన దైవానికి, భక్తికి ఇచ్చిన నిర్వచనాలు ఆసక్తికరం, అనుసరణీయం ఆ విషయాలను ఆయన అనుభవ పూర్వకంగా వివరించారు...

 


‘భక్తి లేకుండా జ్ఞానం కలగడం అసంభవం. పరిపూర్ణమైన భక్తి పరమజ్ఞానంతో ముగుస్తుంది’
- రమణ మహర్షి.

 


శరణాగతి:
రమణుల ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది మదురైలోని మీనాక్షి అమ్మవారి సన్నిధి నుంచి. పదహారేళ్ల వయసులో ఆయన మదురైలోని చిన్నాన్న ఇంట్లో ఉండేవారు. సమీపంలోనే మీనాక్షి దేవి ఆలయం. రమణులు తరచూ ఆ అమ్మవారి కోవెలకి వెళ్తుండేవారు. అమ్మవారిని చూడగానే రమణుల కళ్లలోంచి జలజలా ఆనందభాష్పాలు రాలేవి. ఆ సందర్భాన్నే తలచుకుంటూ రమణులు తదనంతర కాలంలో ఇలా చెప్పేవారు.. ‘‘సర్వాంతర్యామి అయిన అమ్మ సన్నిధిలో నిలబడేవాడిని. నాకు తనపై అకుంఠిత భక్తి కలిగేట్లు అనుగ్రహించమని వేడుకునేవాడిని. అంతకుమించి ఏ ప్రార్థనా చేసేవాడిని కాను. నా అంతరంగం విశ్వాంతరాత్మను స్పృశించినట్లు అనిపించేది’ అంటారు. అమ్మవారంటే అంత భక్తి రమణులకు.

అమిత ప్రేమ:
అరుణాచలేశ్వరుడిపై అమితమైన వ్యాకులతే వెంకటరామన్‌ అనే పదహారేళ్ల కుర్రాడిని అరుణాచలానికి రప్పించింది. రమణమహర్షిగా మార్చేసింది. పదహారేళ్ల వయసులో అరుణాచలం అన్న పేరు చెవిన పడగానే వెంకటరామన్‌ మనసులో ఏదో స్ఫురించింది. తనకి, ఆ అరుణగిరికి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లు అనిపించింది. అతని అంతరంగమంతా ఆ పేరే ఆవరించింది. ‘అరుణాచలం’, ‘అరుణాచలం’, ‘అరుణాచలం’ అన్న నామమే అంతర్ధ్వనిగా ప్రతిధ్వనించసాగింది. ఆ తపనతోనే అరుణాచలం వెళ్లిపోయారు. అరుణాచలం ఆలయంలోకి అడుగుపెట్టగానే, పరుగెత్తుకొని వెళ్లి.. ఆ స్వయంభూలింగాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆనంద పారవశ్యంతో కన్నీటి పర్యంతం అయ్యారు.
ఆర్ధ్రత:
ఓసారి రమణ మహర్షి ముందు ఓ పండితుడు పోతనామాత్యులు తెనిగించిన భాగవతంలోని దశమ స్కందం పారాయణం చేయసాగారు. కృష్ణుడు గోకులం విడిచి వెళ్లిపోతున్న ఘట్టం, గోపికలు విలపిస్తున్న సందర్భానికి సంబంధించిన పద్యాల దగ్గరికి వచ్చేసరికి రమణులు ఉద్విగ్నులైపోయారు. కన్నీళ్లు తుడుచుకుంటూ.. ఆ పండితుడిని పారాయణ ఆపేయమన్నారు. ‘జ్ఞానం గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. భక్తి దగ్గరికి వచ్చేసరికి తట్టుకోలేం. అదంతే!’ అన్నారు.
అది మూఢభక్తి:
తర్కం లేని భక్తిని, ఆచారాలను మహర్షి ఖండించేవారు. ఓసారి ఓ భక్తురాలు ఆయన దగ్గరికి వచ్చి ‘భగవాన్‌! నేను లక్ష పత్రుల వ్రతం చేశాను’ అని గర్వంగా చెప్పింది. అప్పుడు మహర్షి ‘అయ్యో! చెట్టును అన్నిసార్లు గిల్లి ఆకులు కోసి వ్రతం చేయడం ఎందుకు? నిన్ను నీవు ఓ లక్షసార్లు గిల్లుకోలేకపోయావా?’ అన్నారు. ఇలా భక్తి పేరుతో మూర్ఖంగా ప్రవర్తించేవారిని రమణులు కట్టడి చేసేవారు.
ఆధ్యాత్మికోన్నతికి రమణ మహర్షి రెండు మార్గాలను నిర్దేశించారు. ఒకటి ‘ఆత్మ విచారణ’. ఇది జ్ఞానమార్గం. రెండోది ‘శరణాగతి’. ఇది భక్తి మార్గం. ‘విశ్వమయమైన శక్తికి నిన్ను నీవు హృదయపూర్వకంగా, పరిపూర్ణంగా సమర్పించుకో! ఆ శక్తిలో నీవు ఏకమవుతావు. పరమేశ్వరుని పాదాల చెంత నీ భారాన్నంతా విడిచేయి. ఈ లోకపు భారాన్నంతా వహించేది ఆ జగదీశుడే, నీ భారాన్ని మాత్రం నువ్వెందుకు వహించాలి’ అనేవారు. ఈ రెంటినీ బోధించడమే కాదు జీవితంలో ఆచరించి చూపిన ఆచార్యులు వారు.

  ఆ వేళ..
1948 జనవరి 30.. జాతిపిత నిర్యాణవార్త దావానలంలా వ్యాపించింది. రమణమహర్షి ఆశ్రమంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. మహాత్ముని మరణవార్త విన్న వెంటనే రమణులు కన్నీరు పెట్టుకున్నారు. ఆ రోజు సాయంత్రం భక్తులందరూ కలిసి ‘రఘుపతి రాఘవ రాజారాం’ భజన ఆలపించసాగారు. భగవాన్‌ ‘కొనసాగించండి’ అన్నట్లు సైగ చేశారు. మహాత్మునికి నివాళిగా మాతృ భూతేశ్వరాలయంలో కర్పూర హారతి ఇచ్చి, భగవాన్‌ సన్నిధికి తెస్తే విభూతి, కుంకుమను స్వీకరించారు.
- సైదులు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.