close
Array ( ) 1

తాజా వార్తలు

నడిచి.. నడిచి.. ప్రాణం విడిచి..

ఇంటికి చేరేలోపే తెల్లారిపోతున్న వలస బతుకులు  

పుణె: కరోనా దెబ్బకు వలస కూలీల బతుకులు ఛిద్రమైపోతున్నాయి. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఉన్నచోట తినడానికి తిండి దొరక్క, ఆదరించే దిక్కులేక కాలినడకన సొంతూళ్ల బాటపడుతూ మధ్యలోనే తనువు చాలిస్తున్న వలస కూలీలెందరో..! కనీసం తమ కుటుంబ సభ్యులతోనైనా కలిసి ఉండొచ్చనే ఆశతో ఇంటికి బయల్దేరిన వారి బతుకులు మధ్యలోనే ముగిసిపోతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో వలస కూలీలు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మహారాష్ట్రలో మరో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళ్తే.. పింటూ పవార్‌ (40) అనే వ్యవసాయ కూలీ మహారాష్ట్రలోని పుణె నుంచి పర్బానీ జిల్లాలోని తన స్వగ్రామానికి బయల్దేరాడు. లాక్‌డౌన్‌తో వాహనాలు తిరగకపోవడంతో ఎలాగైనా తన సొంతూరుకు చేరుకోవాలనే ఆశతో మండే ఎండల్లో కాలి నడకన  బయల్దేరాడు. ఈ క్రమంలో అతడు ఆకలితో, డీహైడ్రేషన్‌తో ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు. పుణె నుంచి  తన స్వగ్రామానికి బయల్దేరిన పింటూ పవార్‌.. బీద్‌ జిల్లాలోని ధనోరా గ్రామంలో (స్వగ్రామానికి 200 కి.మీల దూరంలో) సోమవారం ప్రాణాలు కోల్పోయినట్టు అంభోరా పోలీస్‌ స్టేషన్‌ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ధ్యానేశ్వర్‌ కుక్లరే తెలిపారు. 

‘‘నడిచి నడిచి అలసిపోయిన పింటూ పవార్‌ ఆకలితో, డీహైడ్రేషన్‌కు గురై ప్రాణాలు కోల్పోయినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మృతుడు పర్బానీ జిల్లాలోని మాన్వాట్ దోప్టే పొందుల్‌ గ్రామానికి చెందినవాడిగా గుర్తించాం. లాక్‌డౌన్‌తో పనిలేకపోవడంతో పుణెలోని  తన సోదరుడి వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత తన సొంత గ్రామానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకొని మే 8న కాలినడకన పుణె నుంచి బయల్దేరాడు. ఆ తర్వాత మే 14న అహ్మద్‌నగర్‌ చేరాడు. అయితే, అతడి వద్ద మొబైల్‌ ఫోన్‌ లేకపోవడంతో వేరొకరి ఫోన్‌తో కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత అక్కడి నుంచి  మరో 30 నుంచి 35 కి.మీల మేర నడక కొనసాగించి అక్కడే ఓ షెడ్‌ వద్ద విశ్రాంతి తీసుకున్నాడు’’ అని పోలీసులు  వివరించారు. 

అయితే, సోమవారం ఆ వైపుగా వెళ్తున్న కొందరు బాటసారులు ఆ షెడ్‌ నుంచి దుర్వాసన వస్తోందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో  అక్కడికి చేరుకున్న పోలీసులు పింటూ పవార్‌ మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాత  ధనోరా గ్రామ పంచాయతీ అధికారులు, పోలీసులు అంత్యక్రియలను నిర్వహించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.