
తాజా వార్తలు
చివరి సెమిస్టర్ పరీక్షలు ఆగస్టులో!
యూజీసీ మార్గదర్శకాల ప్రకారం తప్పదంటున్న అధికారులు
రేపు హైకోర్టుకు చెప్పనున్న ప్రభుత్వం
హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలు ఆగస్టులో నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. పరీక్షలు నిర్వహించరాదని దాఖలైన పిల్‌పై ఈ నెల 9న హైకోర్టులో విచారణ సందర్భంగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయనుంది. తాజాగా యూజీసీ సైతం చివరి సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని చెప్పినందున అవసరమైన జాగ్రత్తలు తీసుకొని వాటిని నిర్వహిస్తామని చెప్పనుంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించారు పరీక్షలు నిర్వహించాలంటే విద్యార్థులకు కనీసం రెండు మూడు వారాల ముందు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆగస్టులో పరీక్షలు జరపాలని నిర్ణయించారు. బీటెక్ విద్యార్థులకు మూడు సబ్జెక్టులే ఉన్నందున సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ప్రాంగణ నియామకాలకు ఎంపికైన వారిలో ఆందోళన
పరీక్షలు నిర్వహిస్తే తాము కొలువుల్లో చేరడానికి ఆలస్యమవుతుందని ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కంపెనీలు ఫోన్లు చేసి ఎప్పుడు చేరతారని అడుగుతున్నట్లు వారు చెబుతున్నారు. ఇప్పుడు చెన్నై, బెంగళూరు, పుణె తదితర నగరాల్లో కొలువుల్లో చేరినా మళ్లీ పరీక్షల కోసం రావాల్సి ఉంటుందని అంటున్నారు. ఐఐటీలు, ఎన్ఐటీలు పరీక్షలను రద్దు చేసినప్పుడు ఇక్కడ ఎందుకు చేయరని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఐఐటీలు, ఎన్ఐటీల్లో పరీక్షలు రద్దు
పలు ఐఐటీలు, ఎన్ఐటీలు చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసి అంతర్గత మార్కులు, గత సెమిస్టర్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చి విద్యార్థులను ఉత్తీర్ణులను చేశాయి. మద్రాస్, దిల్లీ, ఖరగ్‌పూర్, కాన్పూర్, రూర్కీ తదితర ఐఐటీలు, వరంగల్, రూర్కెలా, కురుక్షేత్ర తదితర ఎన్ఐటీలు పరీక్షలను రద్దు చేశాయి. ‘‘50 శాతం మార్కులు గత సెమిస్టర్‌కు, మరో 50 శాతం మార్కులు అసైన్మెంట్లకు కేటాయించి ఫలితాలు కూడా ఇచ్చాం’’ అని ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ రమణారావు చెప్పారు.