
తాజా వార్తలు
ప్రగతి నివేదికలో పచ్చి తప్పులు: లక్ష్మణ్
హైదరాబాద్: విశ్వనగరాన్ని తెరాస, ఎంఐఎంలు విషాద నగరంగా మార్చేశాయని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్రం కేంద్రానికి ఎంత ఇస్తోంది? కేంద్రం తిరిగి ఎంత ఇస్తోందని ప్రశ్నిస్తున్నారని, కేంద్రం ఇచ్చిన నిధుల పేర్లను మార్చి సొంత నిధులుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. గత ఆరున్నర సంవత్సరాల్లో కేవలం 630 మందికి మాత్రమే రెండు పడకల ఇళ్లు ఇచ్చారన్నారు. హైదరాబాద్ డ్రగ్ మాఫియాకు అడ్డాగా మారిందని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. చిన్నారులు సైతం గ్రడ్స్ ప్రభావానికి గురవుతున్నారన్నారు.‘‘ హైదరాబాద్‌ను వంద ముక్కలుగా చేసి అభివృద్ధి చేస్తామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా 15 నూతన డంప్ యార్డులు నిర్మిస్తామన్నారు. అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థ ప్రణాళికలు ఇస్తే బుట్ట దాఖలు చేశారు’’ అని లక్ష్మణ్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి కూడా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, కానీ, నగరంలో స్వచ్ఛమైన నీటి సరఫరా లేదని విమర్శించారు.
దుబ్బాక ఉప ఎన్నికల దెబ్బ నుంచి కేటీఆర్ ఇంకా కోలుకోలేదని లక్ష్మణ్ అన్నారు. గ్రేటర్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు 50కు పైగా సీట్లు కేటాయించామన్నారు. నాలుగు జనరల్ స్థానాల్లో ఎస్సీలకు అవకాశమిచ్చినట్లు చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి గ్రాఫిక్స్‌కు మాత్రమే పరిమితమైందని లక్ష్మణ్ ఆరోపించారు. తెరాస ప్రగతి నివేదికలో పచ్చి అబద్ధాలున్నాయని, డిసెంబరు 4న అసలైన ప్రగతి నివేదికను తెరాసకు ప్రజలు ఇవ్వబోతున్నారని అన్నారు. పన్నుల రూపంలో నగర ప్రజలు రూ.70వేల కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారన్నారు. ఆరున్నరేళ్ళుగా తెరాస ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లు 450 మాత్రమేనని, ఎన్నికల కోసమే ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోందని లక్ష్మణ్ మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించి, నగర అభివృద్ధికి దోహదపడాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.