
తాజా వార్తలు
రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగిస్తారా?
భాజపా తీరుపై వామపక్షాల ధ్వజం
దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చలో దిల్లీ నిర్వహించిన రైతులపై హరియాణాలోని కేంద్రం వ్యవహరించిన తీరుపై వామపక్షాలు మండిపడ్డాయి. దిల్లీ వైపు వెళ్తున్న రైతులపై జల ఫిరంగులు, టియర్ గ్యాస్ ప్రయోగించడం ద్వారా భాజపా తన రైతు వ్యతిరేకతను బట్టబయలు చేసుకుందని పేర్కొన్నాయి. పంజాబ్ నుంచి దిల్లీ వైపు వెళ్తున్న రైతులు రాష్ట్ర సరిహద్దు వద్ద హరియాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. ఈ తరుణంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన భాజపా ప్రభుత్వం రైతులపై చేసిన దాడిగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పేర్కొన్నారు. తమ పార్టీ ఎల్లప్పుడూ రైతులకు మద్దతుగానే నిలుస్తుందన్న ఆయన.. చలో దిల్లీ కార్యక్రమంలో చోటుచేసుకున్న హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
అన్నదాతలకు సెల్యూట్: ఏచూరి
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కార్మికవర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున కదలి సమ్మెను విజయవంతం చేశారని సీపీఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ సమ్మెలో పాల్గొన్న వారికి అభినందనలు తెలిపింది. కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెకు విశేష స్పందన వచ్చిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అన్నదాతలకు, కార్మిక వర్గానికి సెల్యూట్ అంటూ ఆయన ట్వీట్ చేశారు.