close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 13/05/2020 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొత్త నిబంధనలతో లాక్‌డౌన్ ‌4.0: ప్రధాని మోదీ

న్యూదిల్లీ: కరోనాను కట్టడి చేసే క్రతువులో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల మూడోసారి లాక్‌డౌన్‌ను మే 17వ తేదీ వరకూ పొడింగించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పేరిట రూ.20లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. అయితే, ఈ సందర్భంగా ప్రజలందరూ ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా వీక్షించారు. లాక్‌డౌన్‌పై ఆయన ఏం చెబుతారని ఉత్కంఠతో ఎదురు చూశారు. 17వ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం వెలువరిస్తారోనని ఆసక్తిగా ఎదురు చూశారు. అందరూ భావించినట్లుగానే లాక్‌డౌన్‌ 4.0 గురించి మోదీ సూచనప్రాయంగా చెప్పారు.

ప్రధాని మోదీ తన ప్రసంగంలో లాక్‌డౌన్‌ 4.0 గురించి ప్రస్తావిస్తూ.. మాస్కులు కట్టుకుందాం, రెండడుగుల దూరం పాటిద్దామని పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌ 4.0 పూర్తిస్థాయిలో భిన్నంగా ఉంటుందన్నారు. రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనల మేరకు లాక్‌డౌన్‌ 4.0కు సంబంధించిన సమాచారం మే 18 కంటే ముందే అందరికీ తెలియజేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు లాక్‌డౌన్‌ 4.0 ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది. ప్రధాని మోదీ వెల్లడించే నిబంధనలు ఎలా ఉంటాయి? ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు? వేటికి అనుమతులు ఇస్తారు? తదితర విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నాలుగో దశ లాక్‌డౌన్‌కు కావాల్సిన కొత్త రూపురేఖలు రూపొందించనున్నట్లు ప్రధాని చెప్పారు. ఇప్పటికే కొంత మేర లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో పలు పరిశ్రమలు, ప్రైవేటు రంగ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. ప్రధాని మోదీ ప్రసంగించిన మేరకు నాలుగో దశ లాక్‌డౌన్‌లో దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధంగా భారీ స్థాయిలో సడలింపులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకొని లాక్‌డౌన్‌-4కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తామని మోదీ చెప్పారు. కరోనా కారణంగా ఇప్పటికే చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని రకాల పరిశ్రమలు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రకటించిన ప్యాకేజీతో ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూది నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా లాక్‌డౌన్‌ 4.0 విధిస్తూనే కొన్నింటికి మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది.

ఎక్కువ రాష్ట్రాల అభిమతం అదే!

కరోనాను కట్టడి చేయడంలో లాక్‌డౌన్‌ ఎంతగానో ఉపయోగపడిందని సోమవారం ప్రధానితో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రులు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా చాలా మంది లాక్‌డౌన్‌ కొనసాగిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజా రవాణాకు సంబంధించి ప్రత్యేక రైళ్లను నడపటంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సీఎంల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ లాక్‌డౌన్‌ 4.0 కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మోదీ ప్రసంగం ద్వారా అర్థమవుతోంది. అయితే, వేటికి అనుమతులు ఉంటాయి. వేటికి నిరాకరిస్తారన్న విషయం తెలియాలంటే కేంద్ర ప్రభుత్వ ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాలి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.