
తాజా వార్తలు
కరోనా నెగెటివ్ రిపోర్టు ఉంటేనే ఎంట్రీ!
దిల్లీ, మూడు రాష్ట్రాల ప్రయాణికులపై మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు
కరోనా నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు జారీ
ముంబయి: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. దిల్లీ రాజధాని ప్రాంతంతో పాటు రాజస్థాన్, గుజరాత్, గోవా నుంచి విమానాల్లో ముంబయికి వచ్చే ప్రయాణికులు కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ తీసుకురావాల్సిందేనని స్పష్టంచేసింది. పండగ సీజన్ తర్వాత కరోనా కేసులు దేశంలోని పలు చోట్ల పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దిల్లీలో పరిస్థితి ఆందోళనకంగా మారింది. ఈ నేపథ్యంలో దిల్లీ సహా మిగతా మూడు రాష్ట్రాల నుంచి ముంబయి రావాలనుకొనేవారు ప్రయాణానికి ముందుగానే తమ కొవిడ్ నెగెటివ్ రిపోర్టులు సమర్పించాలని పేర్కొంది. ఈ నిబంధనలు నవంబర్ 25నుంచి అమలులోకి రానున్నాయి.
విమాన ప్రయాణికులకు..
* ముంబయిలో విమానం నుంచి దిగేందుకు 72 గంటల ముందుగా ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకొని ఉండాలి.
* పైన పేర్కొన్న రాష్ట్రాలకు చెందిన వారు నెగెటివ్ రిపోర్టులు లేకపోతే.. విమానాశ్రయం వద్ద డబ్బులు చెల్లించి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి.
* పరీక్ష చేయించుకున్న తర్వాత మాత్రమే వాళ్లను ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. ఒకవేళ పాజిటివ్‌గా తేలితే మాత్రం కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు.
రైళ్లలో వచ్చే ప్రయాణికులకైతే..
ఆయా ప్రాంతాల నుంచి రైళ్లలో ముంబయికి వచ్చే ప్రయాణికులకు కూడా కొత్త నిబంధనలు విధించింది. మహారాష్ట్రకు వచ్చే ప్రయాణికులంతా కొవిడ్ నెగెటివ్ రిపోర్టులు తీసుకురావాల్సిందేనని స్పష్టంచేసింది. ముంబయి చేరుకొనే సమయానికి 96గంటల ముందు పరీక్ష చేయించుకోవాలని పేర్కొంది. కొవిడ్ నెగెటివ్ రిపోర్టులు లేనివారికి ఆయా రైల్వే స్టేషన్లలో శరీర ఉష్ణోగ్రతలను పరీక్షిస్తారు. కొవిడ్ లక్షణాలు లేవని తేలితేనే వాళ్లను ఇంటికి అనుమతిస్తారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని వేరు చేసి వారికి యాంటీజెన్ పరీక్ష నిర్వహిస్తారు. కొవిడ్ లేదని తేలాకే వాళ్లందరినీ ఇంటికి పంపుతారు.