
తాజా వార్తలు
చైనా కంపెనీలకు ‘మహా’ షాక్
5 వేల కోట్ల డీల్స్ నిలిపివేస్తూ కీలక నిర్ణయం
ముంబయి: చైనా కంపెనీలకు మహారాష్ట్ర సర్కారు షాకిచ్చింది. సుమారు రూ. 5 వేల కోట్ల విలువ జేసే ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మ్యాగ్నటిక్ మహారాష్ట్ర 2.0 పెట్టుబడుల సదస్సులో భాగంగా మహారాష్ట్ర సర్కారు చైనా సంస్థలతో మూడు ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో వాటిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి సుభాష్ దేశాయ్ తెలిపారు.
‘‘కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టులను నిలిపివేశాం. కేంద్రం నుంచి తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం’’ అని మంత్రి వెల్లడించారు. వీటిలో ఆటో మొబైల్ ప్లాంటు ఏర్పాటుకు గ్రేట్ వాల్ మోటార్స్ సంస్థ రూ. 3,770 కోట్లు, పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ రూ.1000 కోట్లు, హెంగ్లీ ఇంజనీరింగ్ సంస్థ రూ. 250 కోట్ల విలువచేసే ప్రాజెక్టులు ఉన్నట్లు మంత్రి తెలిపారు.
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో భారత్ సైనికులు 20 మంది వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే నినాదం ఊపందుకుంది. ఇప్పటికే భారతీయ రైల్వేకు చెందిన డీఎఫ్‌సీసీఐఎల్ సంస్థ చైనాకు చెందిన కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దేశ వ్యాప్తంగా పలు వర్తక సంఘాలు, వాణిజ్య వ్యాపారులు చైనా ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలానే పలువురు కేంద్ర మంత్రులు సైతం ప్రజలు స్వచ్ఛందంగా చైనా వస్తువులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి..