
తాజా వార్తలు
సూర్యపై మహేశ్ ప్రశంసలు
హైదరాబాద్: ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని సుధాకొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. సూర్య కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. సూర్య నటనకు ప్రేక్షకులతోపాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని వీక్షించిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.. సూర్యపై ప్రశంసల జల్లు కురిపించారు. సూర్య నటన అద్భుతంగా ఉందని మహేశ్ అన్నారు.
‘‘ఆకాశం నీ హద్దురా’.. ఓ స్ఫూర్తిదాయకమైన చిత్రం!! సుధాకొంగర దర్శకత్వం బాగుంది. సూర్య నటన అద్భుతంగా ఉంది. నువ్వు మరెన్నో విజయాలు అందుకోవాలి బ్రదర్. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్’ అని మహేశ్ ట్వీట్ చేశారు.
మహేశ్ ప్రశంసలపై తాజాగా సూర్య స్పందించారు. ‘సర్కారువారి పాట’ సినిమా కోసం తాను ఎదురుచూస్తున్నట్లు వివరించారు. ‘థ్యాంక్యూ బ్రదర్!! మీరు కథానాయకుడిగా రానున్న ‘సర్కారువారి పాట’ కోసం ఎదురుచూస్తున్నా’ అని సూర్య బదులిచ్చారు.