
తాజా వార్తలు
ముంబయిలో భారీ అగ్నిప్రమాదం
ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగర శివారు ప్రాంతమైన మంఖుర్ద్లో ఖాళీ చమురు పీపాలు ఉంచే ప్రదేశంలో మంటలు చెలరేగాయి. ఈ ఉదయం 6 గంటలకు సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి తరలి వెళ్లారు. అధికారుల కథనం ప్రకారం... మండాలా ప్రాంతంలోని మంఖుర్ద్-ఘట్కోపర్ లింక్ రోడ్డు సమీపంలో వ్యర్ధాలు, ఆయిల్ పీపాలు ఉంచే ఐదు గోదాములలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. కాగా, ఈ గోదాములు 15,000 చ.కి.మీ వైశాల్యంలో విస్తరించి ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన చిన్న తరహా ప్రమాదమని తొలుత అధికారులు భావించారు. మంటల తీవ్రత పెరగటంతో ఉదయం 6:40 ప్రాంతంలో దీనిని భారీ స్థాయి ప్రమాదమని ప్రకటించారు. మూడు అగ్నిమాపక జెట్ ఇంజన్లు, ఆరు అగ్ని మాపక యంత్రాలు, ఐదు జంబో ట్యాంకర్లు, అగ్ని నిరోధక పదార్థాలను ఉపయోగించి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గాలులు అధికంగా వీస్తున్నందున మంటల నియంత్రణ కష్టమౌతోందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎవరూ మృతిచెందినట్టు, గాయడినట్టు సమాచారం లేదని అధికారులు వివరించారు.