‘చలో దిల్లీ’లో విషాదం
close

తాజా వార్తలు

Published : 29/11/2020 19:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘చలో దిల్లీ’లో విషాదం

కారుకు నిప్పంటుకొని వ్యక్తి మృతి 

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘చలో దిల్లీ’ నిరసన కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. రైతుల నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ఓ వ్యక్తి అగ్నికి ఆహుతయ్యాడు. నిరసనలో పాల్గొనేందుకు అనేక మంది రైతులు వారి ట్రాక్టర్లతో పాటు రాజధానికి చేరుకున్నారు. అయితే ఆ ట్రాక్టర్లకు ఏమైనా రిపేర్లు వస్తే స్వచ్ఛందంగా చేసేందుకు పంజాబ్‌కు చెందిన జనక్‌ రాజ్‌ (55) సైతం దిల్లీకి వెళ్లాడు. దిల్లీ-హరియాణా సరిహద్దు అయిన బహదుర్‌ఘర్‌ ప్రాంతంలో పోలీసులు అతడిని అడ్డుకోవడంతో రైతులతోపాటే అతడూ అక్కడే ఉన్నాడు. శనివారం కొన్ని ట్రాక్టర్లకు రిపేర్లు చేసిన అనంతరం రాత్రి కారులో నిద్రించాడు. అయితే ప్రమాదవశాత్తు ఆ కారుకు నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో జనక్‌ రాజ్‌ కారులోనే సజీవ దహనమయ్యాడు. 

జనక్‌ రాజ్‌ మృతిపై శిరోమణి అకాళీదల్ అధ్యక్షురాలు హర్‌సిమ్రన్‌కౌర్‌ బాదల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైతు ఉద్యమ చరిత్రలో జనక్‌ రాజ్‌ పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందన్నారు. ‘జనక్‌ రాజ్‌ మృతి విస్మయానికి గురిచేసింది. రైతు ఆందోళనకు మద్దతుగా నిలిచి, వారి ట్రాక్టర్లను రిపేర్‌ చేస్తున్న వ్యక్తి మృతి చెందడం కలచివేసింది. రైతు ఉద్యమంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అని ట్వీట్ చేశారు. జనక్‌ రాజ్‌ మృతి పట్ల అన్ని వ్యవసాయ సంఘాలు విచారం వ్యక్తం చేశాయి.

కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన చలో దిల్లీ ఆందోళన ఆదివారంతో నాలుగో రోజుకు చేరింది. పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌తోపాటు పలు రాష్ట్రాలనుంచి హస్తినకు వచ్చిన రైతులు ఆందోళన చేపడుతున్నారు. అయితే రైతుల రాకను ఎక్కడికక్కడే అడ్డుకున్న పోలీసులు వారిని రాజధానిలోకి ప్రవేశించేందుకు అంగీకరించడం లేదు. రామ్‌లీలా మైదానంలో లేదా జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలు కొనసాగించేందుకు అనుమతించాలని రైతులు కోరుతున్నారు. ఇందుకు కేంద్రం అంగీకరించడం లేదు. డిసెంబర్‌ 3న చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించగా.. వెంటనే చర్చలు జరపాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని