
తాజా వార్తలు
భారీ ఊగిసలాటలో మార్కెట్లు
ముంబయి: కరోనా కష్టాల నుంచి నిన్న తేరుకొని భారీ లాభాలను నమోదు చేసిన మార్కెట్లు నేడు ఊగిసలాటలో పయనిస్తున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో కోలుకొని 100 పాయింట్లకు పైగా లాభపడ్డాయి. తిరిగి కొద్ది సమయంలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. మళ్లీ కోలుకొని ఉదయం 9:51 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 525 పాయింట్లు లాభపడి 30,592 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 155 పాయింట్లు ఎగబాకి 8,948 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.48 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా కరోనా విజృంభణ కొనసాగుతుండడం.. అమెరికాలో మరణాల సంఖ్య భారీగా నమోదుకావడం వంటి పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. అయితే ఓవైపు అన్ని దేశాలు ఉద్దీపన పథకాలు ప్రకటిస్తుండడం.. మరోవైపు డబ్ల్యూహెచ్ఓ పనితీరుపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేయడం వంటి పరిణామాలతో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
గెయిల్, సిప్లా, హెచ్యూఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, బ్రిటానియా, వేదాంత, హెచ్డీఎఫ్సీ, హీరో మోటోకార్ప్, హెచ్సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఐటీసీ లిమిటెడ్, ఇండ్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.